'థెరీసా పవిత్రమూర్తి.. ఆమెను వదిలేయండి'
భారతరత్న మదర్ థెరిసాపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. థెరీసా పవిత్ర మూర్తి అని దయచేసి ఆమె విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. మదర్ థెరీసాను వివాదాల్లోకి లాగొద్దని, ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా వదిలేయాలని కోరారు. తాను కోల్కతాలోని నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో థెరీసాతో కలిసి కొంతకాలం పనిచేసినట్లు కేజ్రీవాల్ చెప్పారు.
అలాగే, సీపీఎం కూడా భగవత్ వ్యాఖ్యల విషయం స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలతో ప్రపంచంలో భారత్కు ఉన్న గొప్ప ఇమేజ్ తగ్గుతుందని పేర్కొంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసి భగవత్ కొత్తగా ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారో అర్థం కావాడం లేదంది. అలాగే ఢిల్లీ కేథలిక్ అర్కడైయాసిస్ ఫాధర్ సవారిముత్తు స్పందిస్తూ మదర్ థెరీసాపై ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఆమె జీవితం మొత్తాన్ని సేవకే అంకితం చేసినట్లు తెలిపారు. కాగా, మదర్ థెరీసా సేవ చేయడం వెనుక మతమార్పిడి అంశం ఉందని భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.