వెంకయ్యపై నటుడి ట్వీట్.. విమర్శల వెల్లువ
బెంగళూరు: భారత 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడును అభినందిస్తూ కన్నడ నటుడు జగ్గేశ్ ట్విటర్లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందని వెంకయ్య నాయుడుని రాష్ట్రం తరపున రాజ్యసభకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో నిరసనలు, ఆందోళనలు చేసారని.. ఇపుడు అదే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారని ట్వీట్ చేశారు. దీనిపై అన్ని వర్గాల నుంచి జగ్గేశ్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. జగ్గేశ్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కన్నడ ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో ఆయన తన ట్వీట్‌ను తొలగించారు.
కన్నడిగ కాదన్న కారణంతో గతంలో వెంకయ్య నాయుడి రాజ్యసభ సభ్యత్వాన్ని చాలా మంది కర్ణాటక ప్రజలు వ్యతిరేకించారు. దీంతో ఆయనను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలన్న నిర్ణయాన్ని బీజేపీ అప్పట్లో మార్చుకుంది. కాగా, ఉపరాష్ట్రపతిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా కర్ణాటక వచ్చిన వెంకయ్య నాయుడిని ఆదివారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఘనంగా సన్మానించారు. తనకు కర్ణాటకే రాజకీయ పునర్జన్మనిచ్చిందని ఈ సందర్భంగా వెంకయ్య వ్యాఖ్యానించారు.