నార్త్ టెక్సాస్ వర్సిటీతో వీఆర్ సిద్ధార్థ ఒప్పందం
కానూరు(పెనమలూరు) :
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్తో సరస్పర సహాయ సహకారాలపై కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు వీఆర్ సిద్ధార్థ కాలేజీలో శుక్రవారం ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ బారెంట్ బ్రియంట్ మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్సుల వివరాలు తెలియజేశారు. ఐదేళ్లకే బీటెక్, ఎంఎస్ పూర్తి చేయవచ్చన్నారు. డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ విద్య అభ్యసించవచ్చని చెప్పారు. స్కాలర్షిప్స్, రీసెర్చ్ వివరాలు కూడా వివరించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు మలినేని రాజయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, డీన్ డాక్టర్ పి.పాండురంగారావు, కంప్యూటర్స్ విభాగాధిపతి శ్రీనివాసరావు, రీసెర్చ్ డీన్ శాస్త్రి, ప్రొఫెసర్ రామ్ దంతు తదితరులు పాల్గొన్నారు.