ఆంధ్రాబ్యాంక్ ఎదుట రైతుల ఆందోళన
- బ్యాంక్ కార్యకలాపాలను స్తంభింపచేసిన వైనం
- ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో నిర్లక్ష్యంపై మండిపాటు
- 15 రోజుల్లో చెల్లిస్తామన్నా అంగీకరించని రైతులు
- శుక్రవారం కూడా ఆందోళన కొనసాగించాలని నిర్ణయం
మాధవరం (తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్ : ఇన్పుట్ సబ్సిడీ అందజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మాధవరం, జగన్నాథపురం, అప్పారావుపేట గ్రామాల రైతులు గురువారం మాధవరం ఆంధ్రాబ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగి బ్యాంక్ కార్యకలాపాలను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 2012-13 సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు బ్యాంక్ పరిధిలోని రైతులకు అందలేదు. దీనిపై గతంలో రైతులు మూడు నెలల క్రితం ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా రైతులతో చర్చలు జరిగిన సందర్బంలో బ్యాంక్ మేనేజర్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామని రూరల్ ఎస్సై కఠారి రామారావు సమక్షంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో బ్యాంక్ అధికారుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం బ్యాంక్ వద్దకు చేరుకున్న రైతులు మేనేజర్ యువరాజు, సిబ్బందిని లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.
బ్యాంక్ కార్యకపాలు సాగకుండా బైఠాయించారు. దీంతో బ్యాంక్ సేవలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న బ్యాంక్ ఏజీఎం త్రిపాల్బ్యాంక్ వద్దకు వచ్చి రైతులతో చర్చించారు. తమకు 15 రోజులు గడువు ఇవ్వాలని కోరారు. దీనికి రైతులు అంగీకరించలేదు. 15 రోజుల పాటు బ్యాంక్ కార్యకలాపాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఖాతాదారులను ఇబ్బందులు పెట్టవద్దని, సమస్యను త్వరగా పరిష్కరిస్తానని ఏజీఎం రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు.
గురువారం రాత్రి వరకు దఫదఫాలుగా ఏజీఎం రైతులతో చర్చలు జరిపారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. శుక్ర వారం కూడా ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. మాజీ సర్పంచ్ గంధం బసవయ్య, తమ్మిశెట్టి ఆదినారాయణ, పత్తి రామకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి.గోవింద్, కొండేటి రామకృష్ణ, పోసిన నిరంజన్‌కుమార్, బట్రెడ్డి రాజారావు, పత్తి రాజబాబు పాల్గొన్నారు. ఆందోళన ఉధృతం కాకుండా రూరల్ ఎస్సై క ఠారి రామారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.