మార్పు.. ఎవరి కోసం!
ఎన్టీఆర్ వైద్య సేవ టెండర్లలో మతలబు
నిబంధనలకు నీళ్లొదిలి వ్యవహారం
రూ.కోటి టర్నోవర్ అక్కర్లేదట..
ప్రభుత్వాసుపత్రిలో మాయాజాలం
కర్నూలు(జిల్లా పరిషత్): ఎన్టీఆర్ వైద్యసేవ టెండర్లలో అధికారులు నిబంధనలకు నీళ్లొదిలారు. తమకు అనుకూలమైన వారికి పనులను కట్టబెట్టేందుకు టెండర్లలో మార్పు చేశారు. ఆసుపత్రిలో మందులు సప్లయ్ చేయాలంటే సంవత్సరానికి రూ.కోటి టర్నోవర్ ఉన్న వారే రావాలని, ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి సరఫరా చేసిన అనుభవం ఉండాలనేది పాత నిబంధన. కానీ ఈ నిబంధనను ఈసారి పక్కన పెట్టేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్యాన్సర్ రోగులకు మందులు, హృద్రోగులకు స్టెంట్లు, పరికరాలు, ఆర్థోపెడిక్, న్యూరోసర్జరీ రోగులకు వాడే ఇన్‌ప్లాంట్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అవసరమైన కిట్లు, ఎక్స్‌రే ఫిల్మ్‌లు తదితరాలు సప్లయ్ చేసేందుకు విడివిడిగా ఇటీవల ఆసుపత్రి అధికారులు ఏడాది గడువుతో టెండర్ పిలిచారు. ఏడాదికి లక్షల రూపాయల విలువ చేసే ఈ టెండర్‌ను దక్కించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కాంట్రాక్టర్లు పోటీపడతారు.
ఇందుకు సంబంధించి నియమ నిబందనలను టెండర్ కాపీతో జతపరిచారు. టెండర్ దక్కించుకున్న వారు ఒకేసారి కాకుండా రోగుల అవసరాలను బట్టి పరికరాలు, మందులు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఒక్కో పనికి రూ.50వేలు డిపాజిట్ చేయాలి. టెండర్ దక్కకపోతే ఈ మొత్తాన్ని వారికి తిరిగిస్తారు. టెండర్ దాఖలు చేసే వారు తప్పనిసరిగా డీలర్షిప్ సర్టిఫికెట్, డ్రగ్ లెసైన్స్, ఆదాయపన్ను రిటర్న్స్, రెండేళ్ల కాలం నుంచి ఆడిట్ రిపోర్ట్, ఐదేళ్ల నుంచి సేల్స్ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్, పాన్‌కార్డు కాపీ, రూ.5లక్షల వరకు సాల్వెన్సీ సర్టిఫికెట్, ఏదైనా ఆసుపత్రికి సరఫరా చేసిన అనుభవ సర్టిఫికెట్ జతపరచాల్సి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న వారు సమయానికి మందులు, పరికరాలు సరఫరా చేయకపోతే భవిష్యత్‌లో అతను టెండర్లో పాల్గొనకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.
జేసీ సూచనల మేరకే మార్చాం
గత సంవత్సరం రూ.కోటి టర్నోవర్ నిబంధన పెట్టడం వల్ల ఎక్కువ మంది టెండర్ వేయలేకపోయారు. అందుకే మూడుసార్లు టెండర్ పిలవాల్సి వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో జాయింట్ కలె క్టర్ సూచనల మేరకు నియమ నిబంధనలు సవరించాం.
- డాక్టర్ జె.వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్