29నుంచి కిసాన్‌సంఘ్ జాతీయ మహాసభలు
విజయవాడ (గాంధీనగర్) : భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ మహాసభలు ఈనెల 29, 30, 31 తేదీల్లో గుంటూరు జిల్లా నూతక్కి విజ్ఞాన విహార పాఠశాల ఆవరణలో జరుగుతాయని సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ మహాసభలు రాష్ట్రంలో నిర్వహించడం ఇదే ప్రథమమన్నారు. ఈ సభలు జాతీయ అధ్యక్షుడు బసవేగౌడ అధ్యక్షత జరుగుతాయని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యచరణ చేపడతామన్నారు. రైతులకు మేలు జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెస్తామన్నారు. పంటల బీమా, పంట నష్ట పరిహారం చెల్లింపు వంటి విషయాలపై చర్చిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర అ«ధ్యక్షుడు ఎస్.రాంబాబు, జిల్లా అధ్యక్షుడు మేడసాని విజయభాస్కర్ పాల్గొన్నారు.