ఇక అద్దె ఇంట్లోకి బరాక్ ఒబామా
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడమే కాకుండా తన పదవీ కాలం మరికొన్నాళ్లలో ముగిసిపోతుండడంతో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌ను ఖాళీ చేసి మరో చోటుకు మకాం మార్చనున్నారు. నగరంలోని ‘సిడ్వెల్ ఫ్రెండ్స్ స్కూల్’లో చదువుతున్న తన చిన్న కూతురు సాషా చదువు అక్కడ ముగిసేవరకు ఒబామా ఈ నగరంలోనే ఉండాలని కోరుకుంటున్నారు.
అందుకని ఆయన వైట్‌హౌస్‌కు కేవలం రెండు మైళ్ల దూరంలోనే ఉన్న కలోరమ ప్రాంతంలోని ఓ ఆకర్షణీయమైన ఇంటిని అద్దెకు తీసుకొని ఉండాలని నిర్ణయించుకున్నారు. ట్రంప్ చేతుల్లో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ కుటుంబం నివసిస్తున్న ఇంటికి అరమైలు దూరంలోనే ఉన్న ఇంటిని ఒబామా ఎంపిక చేసుకున్నారు. ఒకప్పుడు బిల్ క్లింటన్ వద్ద వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన జోలాక్హార్ట్ కుటుంబానిది ఆ ఇల్లు. ఆయన ‘గ్లోవర్పార్క్ గ్రూప్’ సహ వ్యవస్థాపకులు కూడా. ఆయన తన భార్య జియోవన్నా గ్రేతో కలసి ఇటీవల వృత్తిరీత్యా న్యూయార్క్ Ðð ళ్లి అక్కడే స్థిరపడ్డారు.
8,200 చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఈ ఇంట్లో తొమ్మిది పడక గదులు, తొమ్మిది బాత్రూమ్లు ఉన్నాయి. తొమ్మిది పడక గదుల్లో ఒకటి సూట్‌లాంటి పడక గది ఉంది. అది మిషెల్ ఒబామా తల్లికి అనువుగా ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా ఆమె ఒబామా కుటుంబంతోనే కలసి ఉంటోంది. ఓ లివింగ్ రూమ్, వంటగది, వసారా కలిగిన ఈ ఇంటికి వెనకాల పచ్చటి గార్డెన్ కూడా ఉంది. ఎనిమిది వాహనాల పార్కింగ్ స్థలం కూడా ఉంది. దీని అద్దె నెలకు 20వేల డాలర్లు ఉంటుందని రియల్ ఎస్టేట్ వెబ్సైట్ జిల్లో తెలియజేసింది.
1928లో నిర్మించిన ఈ ఇంటిని 2014లో జో లాక్హార్ట్ 53 లక్షల డాలర్లకు కొనుగోలు చేసి ఆధునీకరించారు. ఇప్పుడు ఈ ఇంటి విలువ దాదాపు 65 లక్షల డాలర్లు ఉంటుందని అంచనా. అమెరికా మాజీ అధ్యక్షులకు కూడా సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీ ఉంటుందికనుక అందుకు వీలుగా ఈ ఇంటిలో కూడా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుందని సీక్రెట్ సర్వీస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆంటోని ఛాప మీడియాకు తెలిపారు. ఇంటి మొత్తానికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఇంటి ముందు లైట్ల వెలుతురును పెంచాల్సి వస్తుందని, ఇంటికి సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇరుగు, పొరుగు ఇళ్లనుంచి ఏమైనా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందా? అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని, ఆయా కుటుంబాలతో సంప్రతింపులు కూడా జరుపుతున్నామని ఆయన తెలిపారు.