రూ.10 కోట్లతో నూతన ఖజానా భవనం
కోవూరు : రూ.10 కోట్ల నిధులతో జిల్లా ఖజానా నూతన కార్యాలయ భవనం నిర్మించేందుకు ప్రతి పాదనలను ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా ఖజానా అధికారి వీ ఉదయలక్ష్మి తెలిపారు. గురువారం కోవూరు ఉప ఖజానా కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఆమె మట్లాడుతూ జిల్లాలో రాపూరు, వెంకటగిరి, నాయుడుపేట, పొదలకూరు, డక్కిలి మండలాలకు సంబంధించి ఉప ఖజానా కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. వీటికి సొంత భవనాలు నిర్మించేందుకు కలెక్టర్కు నివేదించామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉప ఖజానా కార్యాలయాలు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలను చూపాలని రెవెన్యూ అధికారులను కోరామన్నారు. ఈ పాస్ విధానం రాష్ట్ర్రంలో అమలు చేయాలని పైలెట్ ప్రాజెక్ట్ కింద సత్తెనపల్లి, కైకలూరు ఉప ఖజాన కార్యాలయాలను ఎంపిక చేశారన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు వేతనాల సమయంలో అధిక సంఖ్యలో పేపర్లు ద్వారా నివేదికలు అందించడంతో జాప్యం జరుగుతుందన్నారు. ఈపాస్ విధానం వస్తే పేపర్ రహిత కార్యాలయాలుగా తయారు చేయొచ్చునన్నారు. ఆమె వెంట కోవూరు ఎస్టీఓ శ్రీనివాసులు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.