రెండు ఎఫ్ఐఆర్లనూ సీబీఐకి బదలాయించండి
నిధుల మళ్లింపు కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్), ఇతర బ్యాంకుల్లో లిక్విడేషన్(మూసివేత) కంపెనీల నిధుల మళ్లింపునకు సంబంధించి సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నందున, ఈ వ్యవహారంలో మల్కాజ్గిరి, ఖమ్మం జిల్లా ఖానాపూర్ పోలీస్స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్లను, అన్ని రికార్డులను తక్షణమే సీబీఐ, డీఐజీ(ఏసీబీ విభాగం) హైదరాబాద్కు బదలాయించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
అఫీషియల్ లిక్విడేటర్ పేరు మీద వివిధ బ్యాంకులో ఉన్న కోట్ల రూపాయల నిధుల మళ్లింపు వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.