భూ వివాదంలో వ్యక్తిపై దాడి
పరిస్థితి విషమం
హత్యాయత్నం కేసు నమోదు
కూసుమంచి : భూ వివాదంలో ఓ వ్యక్తిపై దాడి చేయగా.. అతడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మండలంలోని చేగొమ్మలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇరుకులపాటి రమేష్‌కు అతడి చిన్నతాత కుమారుడైన ఇరుకులపాటి వీరభద్రయ్యకు కొంతకాలంగా చేలోని దారి విషయంలో గొడవ జరుగుతోంది. పలుమార్లు ఇద్దరు ఘర్షణ కూడా పడ్డారు. ఆదివారం ఉదయం రమేష్ డ్రిప్ పైపులు వేయించేందకు కూలీలతో వెళుతుండగా వీరభద్రయ్య, అతడి కుమారుడు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వివాదం చోటుచేసుకోవటంతో వీరభద్రయ్య, అతడి కుమారుడు.. రమేష్‌పై గడ్డపార, పారతో దాడికి దిగారు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి క్షతగాత్రుడిని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి అన్న వెంకటేశ్వర్ల ఫిర్యాదు మేరకు వీరభద్రయ్య, అతడి కుమారుడిపై హత్యాయత్నం కేసును నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.