ఆన్లైన్ పోర్టల్‌లో ఇక జోస్ ఆలుక్కాస్ ఆభరణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆభరణాల విక్రయ రంగంలో ఉన్న జోస్ ఆలుక్కాస్ ఇ-కామర్స్‌లోకి అడుగుపెట్టింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు మహేష్ బాబు చేతుల మీదుగా ఆన్లైన్ షాపింగ్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు పోర్టల్‌కు రూపకల్పన చేసినట్టు కంపెనీ ఎండీ వర్ఘీస్ ఆలుక్కా గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. కస్టమర్ల సమయం ఆదా అవుతుందని అన్నారు. ఎన్నో ఉత్పత్తులు ఆన్లైన్లో దొరుకుతున్నాయని, స్వచ్ఛమైన ఆభరణాలను అందుబాటులోకి తేవాలన్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చామని వివరించారు.
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 30 షోరూంలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ‘ఎకానమీ బాగోలేకపోవడంతో ఆభరణాల అమ్మకాలు 30-40 శాతం మందగించాయి. దీనికితోడు బంగారం దిగుమతులపై ప్రభుత్వ నిబంధనలు పెద్ద అడ్డంకిగా మారాయి. విదేశాల నుంచి బంగారం దొంగ రవాణా పెరిగింది. అంతర్జాతీయంగా ధర తక్కువగా ఉన్నా భారత్‌లో మాత్రం గ్రాముకు రూ.400 అధికంగా ఉంది’ అని అన్నారు. 2012-13 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.2 వేల కోట్ల టర్నోవరు అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కంపెనీ ఎండీలు పౌల్ ఆలుక్కా, జాన్ ఆలుక్కా పాల్గొన్నారు.