ఆన్లైన్ తప్పులు.. విద్యార్థికి తిప్పలు
- చదవకపోయినా కేశవరెడ్డి స్కూల్ విద్యార్థిగా ఆన్లైన్లో నమోదు
–గురుకులకు ఎంపికై ఇంటిబాట పట్టిన విద్యార్థి
– లబోదిబోమంటున్న విద్యార్థి తల్లిదండ్రులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆన్లైన్ తప్పులతో ఓ విద్యార్థి తిప్పలు పడుతున్నాడు. లేపాక్షి గురుకుల పాఠశాలకు ఎంపికైన సదరు విద్యార్థి.... ఆన్లైన్లో అనంతపురంలోని వడియంపేట కేశవరెడ్డి స్కూల్లో చదువుతున్నట్లు చూపుతోంది. దీంతో గురుకులం సిబ్బంది ఇంటికి పంపడంతో తల్లిదండ్రులు ఇటు పాఠశాల, అటు ఎస్ఎస్ఓ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వివరాల్లోకి వెళితే... కూడేరుకు చెందిన కె.రాజశేఖర్, మహేశ్వరి దంపతుల కుమారుడు కె. మేఘరాజు 4వ తరగతి అనంతపురం రూరల్ రాజీవ్కాలనీలోని ఎస్పీఎన్ఎన్ఎస్ స్కూల్లో చదివాడు. ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటి లేపాక్షి గురుకుల పాఠశాల (బీసీ)లో 5వ తరగతి ప్రవేశానికి ఎంపికయ్యాడు. అక్కడి స్కూల్లో చేరాడు. అయితే మేఘరాజు వివరాలను చైల్డ్ఇన్ఫోలో ఆన్లైన్ చేయాలని చూడగా... అనంతపురం రూరల్ వడియంపేట కేశవరెడ్డి స్కూల్లో 7వ తరగతి చదువుతున్నట్లు కనిపించింది.
దీంతో గురుకులం సిబ్బంది తల్లిదండ్రులకు కబురుపెట్టారు. వివరాలు ఆరా తీయగా, తమ కుమారుడు కేశవరెడ్డి స్కూల్లోనే చదవలేదని వారు స్పష్టం చేశారు. చైల్డ్ఇన్ఫో జాబితాలో ఇదే విధంగా ఉందని దీనిపై స్పష్టత తీసుకురావాలంటూ యాజమాన్యం తెలిపింది. దీంతో బాధిత విద్యార్థి తండ్రి రాజశేఖర్ వెంటనే వడియంపేటలోని కేశవరెడ్డి స్కూల్కు వెళ్లాడు. తన కుమారుడు మీ స్కూల్లోనే చదవకపోయినా ఆన్లైన్లో ఎలా నమోదు చేశారంటూ ప్రశ్నించాడు. దీనిపై సరైన సమాధానం చెప్పలేని కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం...విద్యార్థి కె.మేఘరాజు తమ స్కూలులో చదవలేదని, ఆ విద్యార్థి పేరును తమ స్కూలు జాబితాలో నుంచి తొలిగించాలంటూ ఎస్ఎస్ఏ అధికారులకు లేఖ రాశారు. అక్కడి అధికారులు ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. విద్యార్థి తండ్రి మాత్రం 15 రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్నాడు. అధికారులు స్పందించి చర్యలు తీసుకుని విద్యార్థికి న్యాయం చేయాలని వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఓబుళపతి డిమాండ్ చేశారు.