సర్గుణం దర్శకత్వంలో మాధవన్
వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు సర్గుణం, సెలెక్టెడ్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న నటుడు మాధవన్ ఈ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రం తెరకెక్కనుంది. ఇరుదు చుట్రు వంటి ఘన విజయం సాధించిన చిత్రం తరువాత ఈ బహుభాషా నటుడు ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. ఇందులో ఇంతకు ముందెప్పుడూ నటించనటువంటి వినూత్న కథా పాత్రలో మాధవన్ కనిపించనున్న ఈ చిత్రం జంగిల్ నేపథ్యంలో యాక్షన్, ఎడ్వెంచర్ కథా ఇతివృత్తంగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు విజయ్‌సేతుపతి హీరోగా ఆరెంజ్ మిఠాయ్, రెక్క చిత్రాలను నిర్మించిన కామన్ మ్యాన్ సంస్థ అధినేత గణేశ్, దర్శకుడు సర్గుణంతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
సర్గుణం ఇంతకు ముందు నిర్మాతగా మాంజాపై చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నయనతార నాయకిగా దోర చిత్రాన్ని నిర్మిస్తున్నారన్నది గమనార్హం. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నటించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలు వెల్లడించారు. కుటుంబ సమేతంగా ముఖ్యంగా పిల్లల్ని అలరించే విధంగా కథను తయారు చేసుకున్న ఈ చిత్ర షూటింగ్‌ను థాయ్‌లాండ్, మంగోలియా, తజికిస్థాన్ దేశాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు సర్గుణం తెలిపారు.