హఠాత్తుగా పెరిగిన బంగారం ధర
⇒ అంతర్జాతీయంగా ఔన్స్ రేటు ఒకేరోజు 30 డాలర్లు పెరుగుదల
⇒ దేశీయంగానూ అదే పరుగు..
⇒ ముంబైలో 10 గ్రా. రూ.355 అప్
న్యూయార్క్/ముంబై: కొద్ది రోజుల నుంచి క్రమేపీ తగ్గిన బంగారం ధర గురువారం ఒక్కసారిగా ఎగిసింది. ఈ ఒక్క రోజులోనే 10 గ్రాముల ధర రూ. 400 వరకూ పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటు 0.25 శాతం –0.50 శాతం శ్రేణి నుంచి 0.75 శాతం –1 శాతానికి పెంచడం, అనూహ్య రీతిలో డాలర్ ఇండెక్స్ 101 కిందకు జారి, 100 స్థాయికి చేరడం అంతర్జాతీయంగా పసిడి ఊతం ఇచ్చింది. అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో పసిడి ధర గురువారం కడపటి సమాచారం అందేసరికి ఔన్స్ (31.1గ్రా)కు దాదాపు 30 డాలర్లు పెరిగి 1,229 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఫ్యూచర్స్‌లో మరింత జోరు..
అంతర్జాతీయంగా పటిష్ట ధోరణితో దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్– ఎంసీఎక్స్‌లో ఫ్యూచర్స్ ధర ఎగబాకింది. తుది సమాచారం మేరకు 10 గ్రాములుకు రూ. 465 లాభపడి రూ.28,450 వద్ద ట్రేడవుతోంది. ఇక ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు రూ.355 పెరిగి రూ.28,570కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ. 28,420కి చేరింది. ఫ్యూచర్స్ మార్కెట్లో దూకుడు ఇదేలా కొనసాగితే శుక్రవారం పసిడి ధర మరింత పైకి పెరిగే వీలుంది. కాగా వెండి ధర కేజీకి రూ.900 పెరిగి రూ.41,540 స్థాయికి ఎగసింది.