ఫ్రీడమ్ 251 ఫోన్ పంపిణీ మొదలైందట!
న్యూఢిల్లీ: అదుగో..ఇదిగో.. అంటూ ఊరిస్తూ వచ్చిన ఫ్రీడం 250 స్మార్ట్ ఫోన్ల డెలివరీ ఎట్టకేలకు మొదలైందట. మొదటి విడత డెలివరీలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో స్వల్ప సంఖ్యలో ఫోన్ల బట్వాడా మొదలు పెట్టినట్టు రింగింగ్ బెల్స్ ప్రకటించింది. సుమారు అయిదువేల ఫోన్లను అందిస్తున్నట్టు వెల్లడించింది. హర్యానాలో 390 ఫోన్లు, పశ్చిమ బెంగాల్లో 540 ఫోన్లు, హిమాచల్ ప్రదేశ్, 484, 605 ఫోన్లు బీహార్లో, ఉత్తరాఖండ్లో 221 ఫోన్లను మొదటి విడతగా పంపిణీ మొదలుపెట్టనట్టు రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్ పీటీఐకి వెల్లడించారు. మొదటి విడతలో అయిదువేల స్మార్ట్ ఫోన్ల డెలివరీకి కట్టుబడి ఉన్నామని గోయల్ తెలిపారు. సుమారు 2,240 యూనిట్లను కొరియర్ సర్వీసు, డిస్ట్రిబ్యూటర్ ద్వారా తమ ఖాతాదారులకు అందించనున్నట్టు ఆయన తెలిపారు.
ఢిల్లీలో వినియోగదారులకోసం 223 ఫోన్లు, పంజాబ్లో 364 , జమ్ము కాశ్మీర్ 108, మహారాష్ట్ర 521, మధ్యప్రదేశ్లో 194, జార్ఖండ్లో 225, రాజస్థాన్లో 365 స్మార్ట్ ఫోన్లకు డెలివరీ చేస్తున్నామన్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్ లో సోమవారం నోయిడా, ఘజియాబాద్, మీరట్ లలో పంపిణీ ప్రారంభిస్తామన్నారు. అనంతరం మిగతా రెండు లక్షల ఫోన్ల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన భాగాలు ఇప్పటికే ఫ్యాక్టరీకి చేరుకున్నాయని తెలిపారు. ఈ క్రేజీ ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ కోసం, కొనుగోలుదారులు డెలివరీ ఛార్జ్ గా రూ 40 రూ.అదనంగా చెల్లించాల్సి ఉందట.
ఐదు నెలల క్రితం ప్రపంచంలోనే అతి చవకైన స్మార్ట్ ఫోన్ అంటూ సంచలనం సృఫ్టించిన ఈ ఫోన్ కోసం ఫిబ్రవరిలో కంపెనీలో 70 మిలియన్ పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు. అయితే ఐటీ జోక్యం, వివాదాలు, పంపిణీ ప్రక్రియ పలుమార్లు వాయిదాపడటం.. యాజమాన్యం మధ్య విభేదాలు నెలకొన్నాయన్న వార్తల ఈ నేపథ్యంలో ఫ్రీడమ్ ఫోన్లపై ఆశపెట్టుకున్న ఖాతాదారులు డైలమాలో పడిపోయిన సంగతి తెలిసిందే.