మావోయిస్టు నేతకు బ్రిటన్‌లో 23 ఏళ్ల ఖైదు
లండన్: బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన వివాదాస్పద మావోయిస్టు నేత అరవిందన్ బాలృష్ణన్ (75)కు శిక్ష ఖరారైంది. సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు అతనికి 23 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. లైంగిక వేధింపులు, అత్యాచారం, సొంత కూతుర్ని అక్రమంగా నిర్బంధించిన కేసులలో దోషిగా తేల్చిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
బాలుగా పేరొందిన అరవిందన్ బాలకృష్ణన్, ఆయన భార్య చందా(69) గతంలో అనుచరులపై లైంగికదాడి, హింస ఆరోపణలు వెల్లువెత్తాయి. లండన్‌లో నిర్వహిస్తున్న కమ్యూనిస్టు సమిష్టి కేంద్రంలో మహిళా సభ్యులను ఆయన హింసిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. సభ్యులను బానిసలుగా చూస్తూ లైంగికదాడులకు గురిచేస్తున్నారని, సొంత కూతురినే 30 ఏళ్ల పాటు నిర్బంధించారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు మొత్తం 25 అభియోగాలను నమోదుచేసింది. విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో శనివారం తుదితీర్పును వెల్లడించింది.
కాగా 1983 నుంచి 2013 మధ్య కాలంలో బాలకృష్ణన్ ఆ మహిళలపై ఆకృత్యాలకు పాల్పడిన విషయం 2013లో వెలుగులోకి వచ్చింది. దీనిపై సరైన ఆధారాలు లభించిన తర్వాతే అభియోగాలు నమోదు చేసినట్లు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) తెలిపింది. అతని భార్య చందా పట్టిన్తో కలిసి బాలకృష్ణన్‌ను 2013 నవంబర్లోనే అదుపులోకి తీసుకున్నా.. ఈ కేసులో అతని భార్యకు సంబంధం లేదని రుజువు కావడంతో గత ఏడాది మొదట్లో ఆమెను విడుదల చేశారు. ఈ కేసుపై బీబీసీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.