OXford university experts
-
మీ BMI సరిచూసుకోండి.. తేడా వస్తే ఇబ్బందులే!
న్యూఢిల్లీ: కోవిడ్ బారినపడిన ఊబకాయులకు రిస్క్ ఎక్కువని ఓ అధ్యయనం తేల్చింది. కోవిడ్–19 సోకిన ఊబకాయులు ఐసీయూల్లో చేరాల్సి రావడం వంటివి ముప్పును ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రైనాలజీ జర్నల్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కోవిడ్ రిస్క్‌కు, శరీర బరువు(బాడీ మాస్ ఇండెక్స్, బీఎంఐ)తో సంబంధమున్నట్లు మొట్టమొదటిసారిగా చేపట్టిన తమ విస్తృత అధ్యయనంలో రుజవైందని యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఒక వ్యక్తి బరువు(కిలోగ్రాములు), అతని ఎత్తు(మీటర్లు)ను భాగించడం ద్వారా శరీరంలోని కొవ్వును బీఎంఐ ద్వారా లెక్కిస్తారు. ఇంగ్లండ్‌లోని 69 లక్షల మంది ప్రజలతోపాటు కోవిడ్‌తో ఆస్పత్రి పాలైన 20 వేల మంది బాధితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని పరిశోధకులు తెలిపారు. బీఎంఐ 23 కేజీ/ఎం2(కిలోగ్రాములు పర్ స్క్వేర్ మీటర్) ఉంటే దానిని ఆరోగ్యకరమైన స్థాయిగా భావిస్తారు. దీనికి మించి ఒక్క యూనిట్ ఎక్కువున్నా కోవిడ్‌తో పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చేరే అవకాశం 5 శాతం, ఐసీయూలో చేరే చాన్స్ 10 శాతం పెరుగుతుందని తెలిపారు. బీఎంఐ 18.5 కంటే తక్కువ ఉన్న వారికీ కోవిడ్–19తో రిస్క్ ఎక్కువేనని వారు వివరించారు. ఇలాంటి రిస్క్ 20–39 ఏళ్ల మధ్య వారిలో అత్యధికం కాగా, 60 ఏళ్ల వారి నుంచి తగ్గుతుందని వెల్లడించారు. 19 ఏళ్లలోపు వారితోపాటు 80 ఏళ్లపైబడిన కోవిడ్ బాధితుల్లో బీఎంఐ చూపే ప్రభావం తక్కువని తెలిపారు. మొత్తమ్మీద చూస్తే 20–39 ఏళ్ల వారిలో మిగతా వయస్సు గ్రూపుల వారితో పోలిస్తే కోవిడ్ ప్రభావం తక్కువగానే ఉందని వెల్లడించారు. -
ఊహించినదానికన్నా వేగంగా రికవరీ
న్యూఢిల్లీ: కోవిడ్–19 ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిపోయిన భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊహించినదానికన్న వేగంగా రికవరీ అయ్యే అవకాశం ఉందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అంచనావేస్తోంది. ఆర్థిక రంగానికి సంబంధించి పలు ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొంది. భారత్ ఆర్థిక వ్యవస్థ 2020 క్యాలెండర్ ఇయర్లో అనుకున్నదానికన్నా కొంచెం బాగుండే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. 2020లో క్షీణ రేటు అంచనాలు ఇంతక్రితం మూడీస్ మైనస్ 9.6 శాతం అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. కఠిన, దీర్ఘకాల లాక్డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఇబ్బందులు... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రక్రియకు ఇక తెరపడినట్లేనని కూడా ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అంచనావేసింది. వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి కారణంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) కూడా ద్రవ్యోల్బణం ఆరు శాతం కన్నా పైనే ఉంటుందని విశ్లేషించింది. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో రెపో మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని వారు అభిప్రాయడ్డారు. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. వ్యవసాయ రంగం పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, ముడి చమురు ధరలు ఒక నిర్దిష్ట శ్రేణితో తిరుగుతుండడం, లాక్డౌన్ నిబంధనల సడలింపులతో సరఫరాల వ్యవస్థ మెరుగుపడుతుండడం ఆర్బీఐ అంచనాలకు ప్రధాన కారణాలు. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ తన పాలసీ సమీక్షలో భావించింది. ఈ అంచనాల నేపథ్యంలో వృద్ధికి దోహదపడే సరళతర ద్రవ్య విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. మరోవైపు ఇప్పటికే ఏడాది ఆపైన కాలపరిమితుల స్థిర డిపాజిట్ రేటు 4.90 నుంచి 5.50 శాతం శ్రేణిలో ఉన్నాయని, ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది నెగెటివ్ రిటర్న్స అనీ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. వడ్డీరేట్లు మరింత తగ్గి, ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంటే అది పొదుపులు, డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లపై ప్రతికూల ప్రభావం చూపి సమీపకాలంలో వృద్ధికి విఘాతం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు. -
భారత్‌లో ఏటా లక్షకుపైగా మరణిస్తారట!
లండన్: పెరుగుతున్న భూతాపోన్నతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్న విషయం తెల్సిందే. ఈ మార్పుల కారణంగా అభివృద్ధి చెందిన దేశాలతోపాటు భారత్‌లాంటి వర్ధమాన దేశాల్లో వ్యవసాయోత్పత్తులు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా 2050 సంవత్సరం నాటికి భారత్‌లో ఏటా 1,60,000 మంది మరణిస్తారని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ యూనివర్శిటీ పరిశోధకులు 155 దేశాలపై అధ్యయనం జరపగా క్లైమేట్ ఛేంజ్ కారణంగా మరణాలు సంభవించే దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఏడాదికి 2,48,000 మంది మరణాలతో చైనా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. భారత్ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్, వియత్నాం, అమెరికా దేశాలు ఉన్నాయి. వ్యయసాయోత్పల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం వల్ల ధరలు పెరిగిపోవడం, సరకులు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం, ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, మాంసం వినియోగం గణనీయంగా పడిపోవడం, పర్యవసానంగా తలెత్తే పౌష్టికాహార లోపం, బరువు తగ్గి పోవడం అనారోగ్య సమస్యలు తలెత్తడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని మరణాలను అంచనావేసినట్లు పరిశోధకులు తెలిపారు. గుండె, క్యాన్సర్ లాంటి జబ్బులోకాకుండా మలేరియా, డెంగ్యూ వ్యాధులు, అంటురోగాల వల్ల మరణాలు సంభవిస్తాయని నేచర్ పత్రిక లాన్సర్‌లో ప్రచురించిన వ్యాసంలో ఆక్స్ఫర్డ్ పరిశోధకులు వివరించారు. 2050 నాటికి అహారోత్పత్తుల అందుబాటు 3.2 శాతం, పండ్లు, కూరగాయలు 4 శాతం, మాంసం ఉత్పత్తులు 0.7 శాతం తగ్గిపోతాయని పరిశోధకులు అంచనా వేశారు. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే మరణాలను అరికట్టేందుకు భారత్ లాంటి దేశాల్లో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి కూడా పరిశోధకులు కొన్ని సూచనులు చేశారు. పలు రకాలుగా వ్యవసాయోత్పత్తుల సాగును ప్రోత్సహించాలని, బియ్యం, గోధుమ పంటలపైనే దృష్టిని కేంద్రీకరించకుండా పండ్లు, కూరగాయల సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని వారు సూచించారు. ఆరోగ్య స్కీమ్‌లను పటిష్టం చేసి ప్రజలకు వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని, ముఖ్యంగా ఎప్పటికప్పుడు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని కనుగొనేందుకు వారి బరువును తూచే అంగన్వాడి వ్యవస్థను విస్తరించాలని సిఫార్సు చేశారు.