గుంటూరు జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
గుంటూరు, న్యూస్‌లైన్ : పుట్టుకతో ముక్కులోని నాసికారంధ్రం పూడుకుపోయి ఊపిరి తీసుకోలేక అల్లాడిపోతున్న పసికందుకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి చెవి, ముక్కు, గొంతు వైద్య విభాగం వైద్యులు గురువారం ఆపరేషన్ చేసి చిన్నారి ఊపిరి తీసుకునేలా చేశారు. జీజీహెచ్‌లో ఇదే మొట్టమొదటి కేసు అని ఆ విభాగాధిపతి డాక్టర్ పి.నారాయణరావు చెప్పారు. ఆపరేషన్ విజయవంతమవడంతో గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మేడికొండూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన సయ్యద్ బాజి, ఖాసింబీలకు మూడు నెలల క్రితం ఆడశిశువు జన్మించింది. చిన్నారికి పుట్టినప్పుడే ముక్కులోని ఎడమవైపు రంధ్రం మూసుకుపోవడంతో ఊపిరితీసుకోలేక అల్లాడిపోయేది. తల్లిదండ్రులు ప్రైవేటు వైద్యులకు చూపించగా జీజీహెచ్‌కు వెళ్లమని వారు సూచించారు.
దీంతో అక్టోబర్ 21న శిశువును జీజీహెచ్‌లో చేర్పించగా ఆపరేషన్ చేసి విజయవంతంగా సమస్యను పరిష్కరించినట్లు డాక్టర్ నారాయణరావు తెలిపారు. వైద్య పరిభాషలో ఈ సమస్యను కోయనల్ ఎట్రీషియా’గా పిలుస్తారని చెప్పారు. చిన్నారికి గుండె సమస్య కూడా ఉండటంతో ఆపరేషన్ చేసేందుకు ఆలోచించాల్సి వచ్చిందన్నారు.