వరకట్న వేధింపులపై కేసు
రాయవరం : వరక ట్న వేధింపుల కేసులో అదుపులోకి తీసుకున్న ప్రధాన నిందితుడిని ఆదివారం రాత్రి ఇంటికి పంపడంపై ఫిర్యాది కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. రెండు గంటల పాటు నిందితుడిని పోలీస్టేషన్‌లోకి తీసుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సోమవారం ఉదయం రాయవరం పోలీస్టేషన్ వద్ద జరిగిన ఈ సంఘటనలో బాధితురాలి కథనం ఇలా...
అనపర్తి మండలం కొత్తూరుకు చెందిన కర్రి అచ్యుతరామారెడ్డి కుమారుడు భరత్‌రెడ్డికి రాయవరం గ్రామానికి చెందిన పడాల వెంకటరామారెడ్డి కుమార్తె శ్రీమౌనికకు 2011 మే 15న వివాహమైంది. వివాహ సమయంలో ఎనిమిది ఎకరాల భూమి, వంద కాసుల బంగారంతో పాటు అచ్యుతరామారెడ్డి కోరిక మేరకు ఆడపడుచు లాంఛనాలు, కారుకొనుగోలుకు రూ. 35 లక్షలు ఇచ్చారు. ఇంకా అదనపు కట్నం కావాలని భర్త వేధిస్తుండంతో మరో రూ.ఐదు లక్షల నగదు, ఎనిమిది కేజీల వెండిని తన తల్లిదండ్రులు ఇచ్చినట్టు శ్రీమౌనిక తెలిపారు. భర్తతో పాటు అత్తమామలు సంధ్య, అచ్యుతరామారెడ్డి, ఆడపడుచు సుదీప్తి కూడా తనను వేధించే వారని ఆమె పేర్కొంది. ఇవి భరించలేక రాయవరం పుట్టింటికి వచ్చినట్టు ఆమె తెలిపింది. ఈ మేరకు రాయవరం పోలీసులకు పిర్యాదు చేసినట్టు తెలిపింది.
నిందితుడిని వదిలేయడంపై ఆందోళన..
ఇదిలా ఉండగా శ్రీమౌనిక ఫిర్యాదుపై పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీస్టేషన్‌కు ప్రధాన నిందితుడైన కర్రి భరత్‌రెడ్డిని తీసుకుని వచ్చి, కొద్దిసేపటికి తిరిగి ఇంటికి పంపించేశారు. విషయం తెలుసుకున్న శ్రీమౌనిక తండ్రి వెంకటరామారెడ్డి, బంధువులు సోమవారం ఉదయం ఆరు గంటలకు స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడిని ఇంటికి ఎందుకు పంపించారని పోలీసులను ప్రశ్నించారు. నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇంటి వద్ద నుంచి స్టేషన్లోకి వెళుతున్న నిందితుడు భరత్‌రెడ్డిని శ్రీమౌనిక,
ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. 8.30 గంటల సమయంలో రాయవరం, బిక్కవోలు, అనపర్తి ఎస్సైలు కట్టా శ్రీనివాసరావు, దొరరాజు, విజయ్‌కుమార్‌లు స్టేషన్ వచ్చి ఆందోళనకారులకు సర్దిచెప్పారు. ఆ సమయంలో శ్రీమౌనిక తాతయ్య వీర్రాఘవరెడ్డి పోలీసుల తీరును ప్రశ్నించారు. కేసులో ఉన్న నిందితులందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి స్టేషన్‌కు వచ్చి ఘటనపై పోలీసులను ఆరా తీశారు. బాధితురాలికి న్యాయం చేయాలని పోలీసులకు సూచించారు. ఆదివారం రాత్రి ఈ సంఘటనపై 498, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడు భరత్‌రెడ్డిని అరెస్టు చేసి, సోమవారం కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్సై కట్టా శ్రీనివాసరావు తెలిపారు.