పర్యాటక ప్రాంతాలు కిటకిట
అరకులోయకు పర్యాటకుల తాకిడి
కళకళలాడిన సందర్శిత ప్రాంతాలు
అరకురూరల్/అనంతగిరి,న్యూస్‌లైన్: విశాఖ ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి. అరకులోయ, పద్మాపురం ఉద్యానవనం, బొర్రాగుహలు, అనంతగిరి, తాడిగుడ, కటికిజలపాతం, గాలికొండ వ్యూపాయింట్లలో సందర్శకుల సందడి కనిపించింది.ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. ఇక్కడి పద్మాపురం ఉద్యానవనం, గిరిజన మ్యూజియం ఒక్కసారిగా కళకళలాడాయి.
రైల్‌కమ్ రోడ్డు ప్యాకేజీ, ప్రైవేటు వాహనాలు, టూరిజం బస్సుల్లో వందలాది మంది రావడంతో అరకులోయతోపాటు పరిసర ప్రాంతాల్లో సందడి సంతరించుకుంది. వాహనాలు అధిక మొత్తంలో రావడంలో అరకులోయ టౌన్షిప్, మ్యూజి యం ఎదుట, పద్మావతి గార్డెన్‌రోడ్డుల్లో రద్దీతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఒక్కరోజే మ్యూజి యంలో ప్రవేశ రుసుం ద్వారా సుమారు రూ.14 వేలు, పద్మాపురం ఉద్యానవనంలో రూ.12 వేలు ఆదాయం వచ్చినట్లు మ్యూజియం మేనేజర్ మురళీ, పద్మాపురం ఉద్యానవనం మేనేజర్ లకే బొంజుబాబు తెలిపారు.
ఎండ తీవ్రత నుంచి ఉపశమనానికి మైదాన ప్రాంతాలవారు ఏజెన్సీ బాట పడుతున్నారు. బొర్రాగుహలను సుమారు 5 వేల మంది సందర్శించుకున్నారు. విద్యా సంవత్సరం ఆరంభానికి మరో పది రోజులే గడువు ఉండడం, ఏటా జూన్ మొదటి రెండు వారాల్లో పర్యాటకుల రద్దీ ఉంటుందని ఆశాఖ అధికారులే పేర్కొంటున్నారు. వారం రోజుల్లో రూ. లక్షన్నర ఆదాయం సమకూరినట్టు పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లోని చిరువ్యాపారులకు గిట్టుబాటవుతోంది.