పుస్తకాల కోసం ప్రాణాలనూ లెక్కచేయలేదు..
పల్లన్ వాలా (జమ్మూకశ్మీర్): గిగ్రియాల్ గ్రామంపైకి పాకిస్తాన్ సైన్యం మోర్టార్‌షెల్స్ దూసుకొస్తున్నాయి. సైనికులంతా అప్రమత్తంగా ఉన్నారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇంతటి భీతావహ పరిస్థితిలోనూ సురీందర్ కుమార్ (15) ధైర్యం చేసి బయటికి వచ్చాడు. ఎందుకో తెలుసా? స్కూలు పుస్తకాల కోసం ! గత నెల 28న పాక్ సైన్యం మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడడంతో పల్లన్ వాలా సెక్టార్‌లోని గిగ్రియాల్ గ్రామస్తులను సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో వసతి శిబిరం ఏర్పాటు చేసింది. పదో తరగతి చదివే కుమార్ ఈ శిబిరం నుంచి ఇంటికి వెళ్లి పుస్తకాలు తీసుకొని వచ్చాడు.
‘ఆ రోజు హడావుడిగా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో స్కూలు బ్యాగ్ మర్చిపోయాను. రాత్రంతా నిద్రే పట్టలేదు. మరునాడు తెల్లవారి లేచాక కాలినడకన వెళ్లి పుస్తకాలు తీసుకొచ్చాను. మార్గమధ్యలో సైనికులు నన్ను ఆపి ప్రశ్నించగా, పుస్తకాల కోసం ఇంటికి వెళ్తున్నానని చెప్పాను. ఒక అధికారి నాకు సాయం చేశారు. నేను నడుస్తున్నంత సేపూ మోర్టార్‌షెల్స్ కురుస్తూనే ఉన్నాయి’ అని కుమార్ వివరించాడు. ఈ బాలుడి సాహసగాథ గురించి తెలియడంతో జమ్మూ డిప్యూటీ కమిషనర్ సిమ్రన్ దీప్ సింగ్ వసతి శిబిరాల వద్దే తాత్కాలిక పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ అధికారులు శిబిరాల్లో ప్రత్యేక తరగతులు మొదలుపెట్టారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కూడా కుమార్ వంటి బాలలు పట్టుదలతో చదువులను కొనసాగిస్తున్నారు.