విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్ల దొంగ ఓట్ల దందా
పరిషత్ ఎన్నికల్లో దొంగ ఓట్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు పోలింగ్ కేంద్రాలను తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేయిస్తున్నారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెంలో దొంగఓట్లు వేసేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నించగా, వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారు.
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో కూడా దొంగ ఓట్ల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ కార్యకర్తలు దొంగఓట్లను ప్రోత్సహించడంతో రత్నాబాయి అనే మహిళ వారిని నిలదీసింది. అయితే, ఆమెపై టీడీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోనే దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. మరోవైపు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీలో 400 ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై ఓటర్లు ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో ఓటరు జాబితా తప్పుల తడకగా ఉంది. దీంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు.