యూత్ బూతును అనుసరిస్తోంది.!
► పేరడీ గురుస్వామి ఆవేదన
కావలి(నెల్లూరు): ఆహ్లాదకరమైన హ్యాస్యాన్ని ఆస్వాదించాల్సిన యువత, అర్థంపర్థంలేని అసభ్యకరమైన పదాలనే హాస్యంగా భావించి, అనుసరిస్తోందని, ప్రఖ్యాత పేరడీ గురుస్వామి అన్నారు. కావలిలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంనేందుకు శనివారం పట్టణానికి వచ్చిన ఆయన ‘సాక్షి’ తో ముచ్చటించారు.
సాక్షి: మీ ప్రస్థానం గురించి చెప్పండి.
పేరడీ గురుస్వామి: మాది వైఎస్సార్ కడప జిల్లాలోని పోరుమామిళ్ల, అక్కడే టెన్త్ పూర్తి చేశాను. నాన్న ప్రభుత్యోగి కావడంతో తర్వాత హైదరాబాద్‌కు బదలీ అయ్యాం. అలా హైదరాబాద్‌లోనే స్థిరపడిపోయాను. పోస్టల్ శాఖలో ఉద్యోగం రావడంతో దాన్ని చేసుకుంటూ హాస్యభరిత కార్యక్రామలు నిర్వహిస్తుంటాను.
సాక్షిః మీ హాస్యంలో ప్రత్యేకత ఏమిటి
పేరడి గురుస్వామి: సినిమా పాటలకు పేరడీ కట్టి అదే పాటలోని సాహిత్యాన్ని 25 రకాలుగా పాడుతాను. ఉదాహరణకు ‘నెల్లూరి నెఱజాణా...నే కుంకుమల్లే మారిపోనా..’ పాటను హరిదాసు, బుర్రకథ, ఉగ్గుకథ రూపంలో పాడుతాను. ప్రజలకు బాగా గుర్తుండిపోయిన పాటనే అదే లిరిక్స్‌తో నేటి తరం యువతీ యువకులకు తెలియనీ ప్రాచీన సంగీత మాధ్యమాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాను.
సాక్షి: ఎక్కెడెక్కడ మీ పేరడీ పాటలు ప్రదర్శించారు.
పేరడి గురుస్వామి: మా టీవీలో ‘రివర్స్ గేర్’, మా టీవీ గోల్డ్‌లో ‘పేరటడీ–గారడీ’, ఎన్టీవీలో ‘పేరడీ–కామెడీ’, దూరదర్శన్ యాదగిరిలో ‘నవ్వు–నవ్వించు’ తదితర కార్యక్రమాలు చేశాను. ఈటీవీ ప్లస్‌లో ‘ఆహా ఈహీ ఓహో’ అనే కార్యక్రమాన్ని నాతో మాట్లాడి ప్రారంభించారు. ఇప్పటి వరకూ దేశ విదేశాల్లో 6 వేల ప్రదర్శనలు ఇచ్చాను. పలు సంస్థలు ఎన్నో అవార్డులు ఇచ్చాయి.
సాక్షి: ఈ రంగంలో మీ పరిస్థితి ఎలా ఉంది
పేరడి గురుస్వామి: టీవీ కార్యక్రమాల్లో నీచమైన పదాలను అడ్డదిడ్డంగా ఉపయోగిస్తూ పకపకలతో ఈళలు వేస్తూ చప్పట్లు కొడుతుంటే యూత్ కూడా వారినే అనుసరిస్తోంది. సినిమాల్లో సీనియర్ నటులు బ్రహ్మానందాన్ని పిల్ల హీరో కొడితే జనాలు నవ్వుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు బలపడుతోంది. æఅందుకే సాంప్రదాయ భాష తోనే హాస్యం ఉండాలని వీటన్నింటికీ దూరంగా ఉన్నాను. దూరదర్శన్‌లో ప్రతిరోజు రాత్రి 7కి ప్రసారమయ్యే నవ్వు–నవ్వించు కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్నాను. ఇది పూర్తిగా ఆరోగ్యకరమైన భాషతో నిండిన హాస్యభరిత కార్యక్రమం.