అన్బునాథన్ ఇంట్లో ఓ సినీనటి నగ్న వీడియో
సాక్షి ప్రతినిధి, చెన్నై : కరూర్ జిల్లా గిడ్డంగిలో తనిఖీల ఉదంతం ఇంకా కలకలం రేపుతూనే ఉంది. తవ్వేకొద్దీ అనేక విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అనేక కేసుల్లో చిక్కుకున్న అన్బునాథన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విదేశాలకు పారిపోకుండా ఆయన పాస్‌పోర్టు సీజ్ చేయాలని ఆదాయపు పన్నుశాఖ అధికారులు నిర్ణయించారు.కరూరు జిల్లాలోని మంత్రి నత్తం విశ్వనాథన్ అనుచరుడు, అన్నాడీఎంకే నేత అన్బునాథన్కు చెందిన గిడ్డంగి, ఫాంహౌస్లపై ఈనెల 22వ తేదీన ఫ్లయింగ్ స్క్వాడ్, ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.4.77 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేంద్రప్రభుత్వ చిహ్నాన్ని వాడుకోవడం, అక్రమాలకు అంబులెన్స్ వాహనాన్ని వాడుకోవడం తదితర కేసులు అతనిపై బనాయించారు. స్వాధీనం చేసుకున్న సొమ్ముపై లెక్కల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా అన్బునాథన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
బినామీ మహరాజు:
కేసు విచారణకు సహకరించకుండా అన్బునాథన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆయన వ్యవహారాలపై అధికారులు కూపీలాగే పనిలో పడ్డారు. ముగ్గురు ప్రముఖ మంత్రులకు బినామీ మహరాజుగా వ్యవహరిస్తూ వారి కార్యకలాపాలతోపాటు స్వలాభాలు పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు మంత్రుల వేలాది కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో విదేశీ బ్యాంకుల్లో పెట్టుబడులు, విదేశాల్లో ఆస్తులు, రాష్ట్రంలో కాలేజీలు, పాఠశాలలు స్థాపించినట్లు సమాచారం. ప్రస్తుత ఎన్నికల తరుణంలో అన్నాడీఎంకే తరఫున నగదు బట్వాడా బాధ్యతలను అన్బునాథన్కే అప్పగించారని అంటున్నారు. ఒక్కో నియోజకవర్గానికి కనీసం రూ.10 కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఎవరీ అన్బునాథన్ అని పరిశీలిస్తే...దిండుగల్లు జిల్లాకు చెందిన ఇతను కొన్నేళ్ల క్రితం కరూరుకు వచ్చి స్థిరపడ్డాడు. చోరీకి గురైన వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, నకలీ ఆర్సీ బుక్ తయారుతో ఖరీదైన రేటుకు అమ్మే వ్యాపారాలు చేసేవాడని తెలిసింది. ఇలా 2003 నుండి 2010 వరకు అన్బునాథన్ ఆదాయం రూ.3 కోట్లు మాత్రమే. ఆ తరువాతనే ఇతను కోట్లకు పడగలెత్తినట్లు చెబుతున్నారు. కోట్లకు ఎదగడం వెనుక ముగ్గురు మంత్రుల సహాయ సహకారాలు ఉన్నాయని భావిస్తున్నారు. అన్బునాథన్ సూచించిన విదేశాలకు ప్రభుత్వ పర్యటనగా సదరు మంత్రులు వెళతారు. ఇలా థాయ్‌లాండ్‌లోని ఒక హోటల్లో విందు, విలాసాలు సాగుతాయి. తిరుచ్చికి చెందిన ఒక ఆడిటర్ ద్వారా సింగపూరులోని మరో ఆడిటర్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి.
సింగపూర్ ఆడిటర్ ద్వారా మూడు దేశాల్లో ముగ్గురు మంత్రులకు చెందిన సొమ్ముతో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. దుబాయ్‌లో రూ.1500 కోట్లు ఒక హాస్పిటల్ కోసం పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది. అలాగే తమిళనాడులో రూ.20 కోట్లతో ప్లాస్టిక సంచుల తయారీ పరిశ్రమ, ఒక మెట్రిక్యులేషన్ పాఠశాల కొనుగోలు చేశారు. అన్బునాథన్ సోదరి భర్త ప్రమాదంలో మృతి చెందడం, అలాగే మరికొందరు మరణాల వెనుక మర్మందాగి ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఒక సినీనటితో అన్బునాథన్ అత్యంత సన్నిహితంగా ఉండే వీడియో దృశ్యాలు అతని రెండు సెల్ఫోన్లలో రికార్డు చేసి ఉన్నాయని, ఆ రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంటే ముగ్గురు మంత్రులు వివరాలు, అన్బునాథన్తో నడిపిన లావాదేవీలు బైటపడతాయనే సమాచారాన్ని ఎన్నికల అధికారులకు, పోలీసులకు కొందరు ఉప్పు అందించారు.
కరూరు ఉదంతంపై ఆదాయపు పన్నుశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ అతనికి చెందిన గిడ్డంగి, ఫాం హౌస్‌ల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సొమ్ముపై అన్బునాధన్ను విచారించాల్సి ఉంది, అయితే అతను ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ అంతుపట్టడం లేదని తెలిపారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటంతో పాస్‌పోర్టును సీజ్‌చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పాస్‌పోర్టు సీజ్ చేయాలంటే తమిళనాడు హోంశాఖ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించాల్సి ఉందని అన్నారు. పాస్‌పోర్ట్ సీజ్ చేసేందుకు అవసరమైన ఎఫ్ఐఆర్ను అందజేయాల్సిందిగా వేదారణ్యం పోలీసులను కోరామని చెప్పారు.
సీబీఐ విచారణ జరిపించాల్సిందే: కరుణానిధి
అన్నాడీ ఎంకే అండదండలతో అన్బునాధన్ సాగించిన అరాచకాలు బైటపడలే సీబీఐ విచారణ జరిపించాలని డీఎంకే అధినేత కరుణానిధి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తిరువారూరులో సోమవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, కరూరులో వేలాది కోట్ల రూపాయాలను దాచిపెట్టిన అన్బునాధన్ కార్యకలాపాలు ఏమిటీ, ఎన్ని హత్యకేసుల్లో నిందితుడు అనే విషయాల జోలికి తాను వెళ్లడం లేదని అన్నారు. సీబీఐ విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి వచ్చి కోర్టు బోనులో నిలబెట్టవచ్చని అన్నారు.