పవిత్ర దృక్పథం
ఇరవయ్యేళ్ల అమ్మాయి. ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసింది. అలాంటి ఆమె ఎలా ఆలోచించాలి? మంచి చిత్రాలు తీయాలి, పేరు తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించాలి, పెద్ద సెలెబ్రిటీ అవ్వాలి అనే కదా! పవిత్రాచలం కూడా మొదట అలానే అనుకుంది. కానీ ఓ ఊహించని సంఘటన ఆమె ఆలోచనలను వేరే దిశగా మళ్లించింది. ఓ వ్యక్తి అన్న ఒక్క మాట... ఆమెకో కొత్త గమ్యాన్ని నిర్దేశించింది. ఏమిటా గమ్యం? పవిత్రాచలం తీసిన డాక్యుమెంటరీలు చూస్తే... ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది!
‘‘సినిమా చూస్తే మనసు భారమైపోకూడదు. ఒత్తిళ్లను మర్చిపోవ డానికి సినిమాకెళ్తాం. అక్కడికెళ్లాక సరదాగా ఎంజాయ్ చేయాల్సింది పోయి అక్కడికెళ్లి కూడా బాధపడితే ఇక సినిమాకి వెళ్లడం ఎందుకు? ఇలా అనుకునేవాళ్లెవరూ సందేశాత్మక చిత్రాలు చూడరు. ఇక డాక్యుమెంటరీలేం చూస్తారు, నావయితే అస్సలు చూడరు’’ అంటుంది పవిత్ర. అది నిజమే. ఆమె తీసే డాక్యుమెంటరీలు చూడాలంటే ప్రత్యేకమైన నేత్రం కావాలి. ఎదుటివాడి కష్టాన్ని చూసి కదిలిపోయే సున్నితమైన మనసు ఉండాలి. వాస్తవాలను తెలుసుకుని తట్టుకోగల స్థైర్యం ఉండాలి. అలాంటివాళ్లు మాత్రమే పవిత్ర చిత్రాలను చూడగలరు.
పోతపోసిన ప్రతిభ...
పవిత్రాచలం బెంగళూరులో జన్మించింది. ఆమెకు మొదట్నుంచీ చాలా ఆసక్తులున్నాయి. ప్రతిభాపాటవాలూ ఉన్నాయి. మొదట మౌంట్ కార్మెల్ కాలేజీలో బీఏ చేసింది. మంచి క్రీడాకారిణి. జాతీయ స్థాయిలో రోలర్ స్కేటింగ్ చాంపియన్‌గా ఎదిగింది. జర్నలిజంలో డిప్లొమో చేసింది. న్యూయార్క యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు కూడా చేసింది. ఆ పైన ఓ జాతీయ చానెల్లో చేరింది. అప్పటివరకూ జరిగిందంతా ఒకెత్తు. 2003లో పాకిస్థాన్‌లో జరిగిన యువ శాంతి సదస్సులో పాల్గొనడానికి వెళ్లడం మరో ఎత్తు. ఆ పర్యటన... పవిత్రని, ఆమె ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది.
శాంతి గురించి, సమాజ శ్రేయస్సు గురించి అక్కడ యువతీ యువకులు చేసిన ప్రసంగాలు పవిత్రలో స్ఫూర్తిని నింపాయి. అప్పుడే తొలిసారిగా ఆమెలోని ఫిల్మ్‌మేకర్ మేల్కొంది. ఇరుదేశాల యువత మనోభావాలూ ప్రతిఫలించేలా ‘బస్’ అనే డాక్యుమెంటరీని తీసింది. తరువాత ఆమె వరుసగా తీస్తూనే ఉంది. కానీ అనుకోకుండా ఎదురైన ఓ అనుభవం... ఆమెను ఓ స్ఫూర్తిదాయక ఫిల్మ్‌మేకర్‌ను చేసింది.
2007లో క్యాన్సర్ మీద అవగాహన కలిగించే డాక్యుమెంటరీ తీయడానికి ఆయేషా అనే యువతి దగ్గరకు వెళ్లింది పవిత్ర. ఆయేషా వయసు 26. క్యాన్సర్ ముదిరిపోయింది. మనిషి శుష్కించిపోయింది.
ఇప్పుడో రేపో అన్నట్టుంది. వీడియో తీయడానికి సహకరించే ఓపిక కూడా లేదామెలో. దాంతో నీకు ఓపిక ఉన్నప్పుడు చేద్దాంలే అని చెప్పి వచ్చేసింది పవిత్ర. తర్వాత రోజు ఆయేషా నుంచి ఫోన్ వచ్చింది. ‘రండి తీసేద్దాం’ అని ఆమె అనడంతో వెంటనే వెళ్లింది. ఆయేషాని పవిత్ర అడిగింది... ఇంత నీరసంగా ఉన్నప్పుడు ఎందుకు చేయడం అని! ‘‘నేనెప్పుడు పోతానో నాకే తెలీదు, నేను పోయాక నా వీడియో ఒక్కరికి ఉపయోగపడినా చాలు కదా’’ అంది ఆయేషా.
ఆ మాట పవిత్ర మనసులోకి చొచ్చుకుని పోయింది. చనిపోతూ కూడా ఎదుటి వారికి ఉపయోగపడాలన్న ఆయేషా ఆలోచన... పవిత్రకు సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేసింది. ఆ క్షణమే ఆమె నిర్ణయించుకుంది... ఇక మీదట సమాజానికి ఉపయోగపడే చిత్రాలు మాత్రమే తీయాలని! ‘కర్లీ స్ట్రీట్ మీడియా’ అనే సంస్థను స్థాపించి, సామాజిక సమస్యల్ని చిత్రాలుగా తీయడం మొదలుపెట్టింది.
ట్రాఫికింగ్ గురించి ‘బౌండ్ బై అజ్’, దేవదాసీల గురించి ‘అనామిక’, మాదక ద్రవ్యాలకు బానిసైన వారి కోసం ‘మై ఫ్రెండ్ ద అడిక్ట్’, మానసిక వికలాంగ చిన్నారుల కోసం ‘ఖుష్బూ’, డౌన్ సిండ్రోమ్ బాధితుల గురించి ‘ఇన్ డెలిబుల్’... ఆమె తీసిన ప్రతి చిత్రమూ కదిలించింది. సామాజిక బాధ్యతను గుర్తు చేసింది. ఉన్నట్టుండి ఈ సమాజాన్ని ఏ ఒక్కరూ మార్చేయలేరు. అందుకే... కనీసం సమస్యల విషయంలో అప్రమత్తం చేస్తోంది. వాటి పరిష్కారాల గురించి ఆలోచనలు రేకెత్తిస్తోంది. అందుకు పవిత్రని అభినందించి తీరాల్సిందే!
- సమీర నేలపూడి
పవిత్ర తీసిన డాక్యుమెంటరీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నాయి. వాటన్నింటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ‘రూట్ ఫర్ రూనా’ గురించి. ఓ రోజు ఓ ఆంగ్ల పత్రికలో రూనా అనే రెండేళ్ల అమ్మాయి గురించి కథనం వెలువడింది. త్రిపురకు చెందిన ఆ పాప హైడ్రోసెఫలస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ మెదడు సంబంధిత వ్యాధి ఉన్నవాళ్లకు తల అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. రూనాకి కూడా అలానే పెరిగిపోయింది. ఆమె ఫొటోని పత్రికలో చూడగానే పవిత్ర కదిలి పోయింది. ఆ వ్యాధి గురించి తన టీమ్‌తో కలిసి రీసెర్చ చేసింది. మన దేశంలో రూనాలాగా ఆ వ్యాధితో బాధపడుతోన్న చిన్నారులు చాలమంది ఉన్నారని తెలుసుకుంది. వెంటనే ‘రూటింగ్ ఫర్ రూనా’ అనే డాక్యుమెంట రీని తీసింది. రూనా చికిత్సకి నిధులు సమకూరడంలో ఈ డాక్యుమెంటరీ పెద్ద పాత్రే పోషించింది. రూనాకి విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. మెల్లగా కోలు కుంటోంది. అయితే రూనా లాంటి వారందరినీ కూడా వ్యాధి నుంచి బయటపడేయాలని ప్రయత్నిస్తున్నారు పవిత్ర టీమ్. ఆ వ్యాధిపట్ల అందరికీ అవగాహన కల్పించడంతోపాటు నిధులనూ సేకరిస్తున్నారు.
**************
పవిత్రతో పాటు అడుగులు వేస్తున్నవాళ్లు కొందరున్నారు. అశ్విన్, అక్షయ్ శంకర్, అనన్య రాయ్, రిషి తుషు, జ్యోత్స్న బాలకృష్ణన్, తేజేష్ కిరణ్, అనితా తుషు... వీళ్లంతా పవిత్రలాగే సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న తపన ఉన్నవాళ్లు. అందుకే ఆమెతో చేతులు కలిపారు. ఆమెతో కలిసి అడుగులు వేస్తున్నారు. సమాజంలో ఉన్న సమస్యల మీద పరిశోధన చేయడం, వాటిని ఎలా చూపించాలి, దాని ద్వారా ఏ సందేశం ఇవ్వాలి అన్న విషయాలను అందరూ కలిసి చర్చించుకుంటారు. కలసికట్టుగా నిర్ణయం తీసుకుని ఆ దిశగా సాగిపోతారు.