రెక్కలు ముక్కలు.. ఎన్నాళ్లీ తిప్పలు!
రోడ్డంతా చెత్త నిండినా.. వాళ్లే గుర్తొస్తారు. వీధి దీపాలు వెలుగకున్నా.. వాళ్లే సరిచేస్తారు. కానీ వారింట్లో అన్నీ సమస్యలే. బండ చాకిరి చేసినా.. అరకొర వేతనాలే. అందులోనూ కోతలు! తమ జీవితాల్లో వెలుగులు నింపాలంటూ.. సమస్యలు పరిష్కరించాలంటూ రేపటి నుంచి కార్మికలోకం సమ్మెబాట పడుతోంది.
- కార్మికులకు కనీస వేతనాలు కరువు
- దుర్భర పరిస్థితుల్లో కుటుంబాలు
- రేపటి నుంచి సమ్మెబాట
వరంగల్ అర్బన్ : జిల్లాలో 3,175 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు అరకొర వేతనాలతో బతుకులీడుస్తున్నారు. పద్నాలుగేళ్లకు పైగా వీరు బల్దియూల్లో పనిచేస్తున్నారు. కాలం, సమయంతో సం బంధం లేకుండా నిరంతరం శ్రమిస్తున్నా.. దానికి తగిన వేత నం అందడం లేదు. బల్దియాల్లో పనిచేస్తున్న కార్మికుడి వేతనం రూ.8,300. ఫీఎఫ్, ఈఎస్సై తదితర సొమ్ము రూ.1,100 వరకు కోత పడుతోంది. సెలవులు, బయోమెట్రిక్ మొరాయింపుతో వేతనాల్లో కోత వేస్తారు.
వరంగల్ బల్దియా పరిధి విలీన గ్రామాల కార్మికులకు ఇటీవల వేతనాలు పెంచారు. కానీ వీరికి ఈఎస్సై,ఫీఎఫ్ లాంటి సౌకర్యాలు లేవు. విద్యుత్ స్తంభాలు ఎక్కి, వీధి లైట్లు పెట్టే కార్మికులకు, ఫిల్టర్ బెడ్లలో పనిచేసే కార్మికుల నెల వేతనం రూ. 6,700. కానీ వీరిలో చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు. మరికొందరు పనిభారం ఎక్కువై మద్యానికి బానిసవుతున్నారు. సరైన వైద్యసేవలు అందక విలువైన జీవితాలను కోల్పోతున్నారు. పాలకులు కమిషనర్లు, అధికారులు.. పనిముట్లు సమాకుర్చి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.