నిరాహార దీక్ష చేపట్టిన మధ్యప్రదేశ్ సీఎం
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేవరకూ తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం చౌహన్ తన భార్య సాధనతో కలిసి ఈరోజు ఉదయం 11 గంటలకు దీక్షలో కూర్చున్నారు. భోపాల్లోని దసరా మైదానంలో దీక్ష కొనసాగుతున్నది. కాగా మందసౌర్ జిల్లాలో రైతులపై కాల్పులు ఘటనతో రాష్ట్రంలో ఒక్కసారిగా హింస పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసుల కాల్పుల్లో అయిదుగురు రైతులు మృతి చెందారు. దీంతో రైతులు రోడ్లను బైఠాయించి నిరసనలు, నినాదాలతో పాటు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. శుక్రవారం కూడా పోలీస్ కస్టడీలో ఉన్న మరో రైతు ప్రాణాలు కోల్పోవడంతో శాంతి భద్రతలు మరింతగా క్షీణించాయి. ఈ ఆందోళనలు పక్క జిల్లాలకు కూడా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో శాంతి స్థాపనే లక్ష్యంగా చౌహన్ ఈ దీక్షకు దిగారు.
మరోవైపు ముఖ్యమంత్రి ....ఇక్కడ నుంచే పాలన కొనసాగిస్తారని అధికారులు తెలిపారు. ప్రజలు... సీఎంను కలిసి తమ సమస్యలను చర్చించవచ్చని పేర్కొన్నారు. మరోవైపు రైతులకు పంట రుణాల నుంచి విముక్తి కల్పించడం అసాధ్యమని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జీఎస్ బైసన్ అభిప్రాయపడ్డారు.