ప్రజా సమస్యలపై సదస్సులు
అనంతపురం అర్బన్: రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెలలో పెద్ద ఎత్తున్న సదస్సులు, సమావేశాలను నిర్వహించాలని సీపీఐ కార్యదర్శి వర్గం తీర్మానించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తెలిపారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. అనంతరం జగదీశ్ విలేకరులతో మాట్లాడారు. వి.కె.ఆదినారాయణరెడ్డి శత జయంతి ఉత్సవాలను అక్టోబరు 8న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 100 టీఎంసీలకు పెంచాలని ఈనెల 20న అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. విద్యా, వైద్య రంగాలపై ఎస్కేయూలో, ఉక్కు కర్మాగారం పనులు ప్రారంభించాలన్న డిమాండ్‌తో 22న రాయదుర్గంలో, పీఏబీఆర్ కుడికాలు కింద ఉన్న చెరువులు, చెక్‌డ్యాంలకు కృష్ణా జలాలు కేటాయించాలన్న డిమాండ్‌తో ఈ నెల 28న రాప్తాడులో సదస్సు నిర్వహిస్తామన్నారు.
అలాగే గుంతకల్లు నియోజవర్గంలోని చెరువులకు హంద్రీ–నీవా ద్వారా నీరు ఇవ్వాలన్న ఽడిమాండ్తో 29న గుంతకల్లులో సదస్సు నిర్వహిస్తామన్నారు. చేనేత రంగంపై జీఎస్టీ ఎత్తివేయాలని ధర్మవరంలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తామనారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని సమస్యలపై 30న పుట్టపర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కార్యదర్శి వర్గం నిర్ణయించిందన్నారు. అలాగే గార్లదిన్నెలో 31న రైతాంగ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కరువు పరిస్థితులపై సెప్టెంబరు ఒకటిన కదిరిలో సెమినార్ నిర్వహిస్తామన్నారు.