ఏది ప్రజాసాహిత్యం?
పేదలు, కార్మికుల గురించి రాస్తే అది ప్రజాసాహిత్యం అవుతుందా అని ప్రశ్నిస్తారు లూ షూన్. చైనీస్ సాహిత్యంలో ఈ అరుణతార (1881-1936) అభిప్రాయాలివి(అనువాదం: ముక్తవరం పార్థసారథి):
‘పేదలు, కార్మికులు, కర్షకుల గురించి రాస్తే ప్రజాసాహిత్యమవుతుంది’ అంటారు కొందరు. ఆయా వ్యక్తులు ఏమనుకుంటున్నారో, తమ గురించి తాము రాసుకుంటే ఎలా ఉంటుందో అలా రాస్తే ప్రజాసాహిత్యమవుతుంది గాని, గట్టు మీద కూర్చుని, ప్రేక్షకుల్లా పరిశీలించి రాసింది ఎలా ప్రజాసాహిత్యమవుతుంది? మధ్యతరగతి రచయితలు, తమ అభిప్రాయాలను, విలువలను వాళ్లకు ఆపాదించి రాయటం ఆత్మద్రోహమూ, సాహిత్య ద్రోహమూ. అలాగే, జానపద గీతాల పేరుతో ప్రచారంలో ఉన్నవి మన మిత్రులు ఆ బాణీలో రాసిన పాటలే తప్ప నిజంగా జానపదులు పాడిన పాటలు కావు. జానపద కథలూ అంతే. మన సమాజంలో నిరక్షరాస్యులే అధికం. చదవగలిగినవాళ్లలో కూడా సాహిత్యాభిలాషులెందరు? ఇక ‘మన’ పాఠాలు మరీ తక్కువ. అందువల్ల సాహిత్యంలో సామాజిక పరిస్థితుల్ని మారుస్తామనుకోవటం ఒక భ్రమ మాత్రమే.
మరికొందరు ‘నిబద్ధత’ గురించి నిరంతరం వుపన్యసిస్తారు. దేనిపట్ల నిబద్ధత? సమాజంలోని దోపిడి గురించి, తిరుగుబాట్ల గురించి రాయాలనుకోని రచయితలుండరు. కాని, ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు, వాళ్ల జీవన పరిస్థితులు మనకు తెలుసా? రాయాల్సింది సమస్యల గురించి కాదు (అలా రాస్తే వ్యాసం అవుతుంది). సమస్యలనెదుర్కొంటున్న వ్యక్తుల గురించి. మన గురించి మనం తెలుసుకుంటే తప్ప పాత్రల ప్రవర్తనను విశ్లేషించలేం. రచన జీవితానికి అద్దం పడుతుందనుకుంటే ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబాలు అందంగా ఉండవు. రచనా ప్రయోజనం ముసుగుల్ని తొలగించటమే తప్ప కప్పటం కాదు.