వ్యూహం హుజూరాబాద్‌లోనే
హుజూరాబాద్ :
వరంగల్ జిల్లా హన్మకొండలోని అదాలత్ ప్రాంతంలో నివాసముండే పిల్లల వైద్య నిపుణుడు ప్రభుత్వ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. మిగతా సమయంలో హుజూరాబాద్‌లో క్లినిక్ నిర్వహిస్తుంటాడు. ప్రభుత్వాస్పత్రిలో విధులు ముగించుకుని నిత్యం హుజూరాబాద్‌కు కారులో వస్తుంటారు. పేషెంట్లు ఎక్కువగా ఉంటే ఒక్కో రోజు రాత్రి 10 గంటల వరకు వైద్యం చేస్తారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం తన కారులో హన్మకొండకు వెళ్తుండగా.. ఎల్కతుర్తి మండలం బావుపేట వద్ద ఓ ఇన్నోవా వాహనంలో నలుగురు అగంతకులు వచ్చి వైద్యుడి కారుకు అడ్డం పెట్టినట్లు తెలిసింది. రోడ్డుపైనే వాగ్వాదం జరిపి ఆ తర్వాత చితకబాది వైద్యుడి కారులోనే వేరే చోటుకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ సమయంలో ఓ వ్యక్తి చితకబాదుతూ ప్రతీరోజు సాయంత్రం 6 గంటల వరకే క్లినిక్ నిర్విహ ంచకుండా, ఇలా అర్ధరాత్రి వరకు వైద్యం చేయడం అవసరమా..? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. ఇంతలో మరో వ్యక్తి జోక్యం చేసుకుని కొట్టకుండా ఆపే ప్రయత్నం చేయగా, ఈ వైద్యున్ని చంపినా మనకు డబ్బులే వస్తాయని, అయినా ఇతన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు గుంజుదామని చర్చించినట్లు సమాచారం. రెండురోజులపాటు వారి ఆధీనంలో ఉంచుకుని రూ. 35 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. వైద్యుడి ఫోన్నుంచే ఇంటికి సమాచారాన్ని పంపించి ఓ చిరునామా వద్ద ఉన్న వ్యక్తికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ.16 ల క్షలు ముట్టజెప్పినట్లు చర్చ జరుగుతోంది. మిగతా డబ్బుల బాధ్యతను వైద్యుడికి అప్పగించి వదిలేయగా, భయభ్రాంతులకు గురైన సదరు వైద్యుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విచారణ ప్రారంభించారు. కొద్ది రోజులుగా సదరు వైద్యుడు హుజూరాబాద్‌లోని క్లీనిక్‌ను తెరవకపోవడంతో విషయం కాస్తా బట్టబయలైంది.
పలువురిపై అనుమానం
కిడ్నాప్ ఉదంతంలో పోలీసులు పలువురిని అనుమానిస్తున్నారు. బాధితుడు చెప్పిన విషయాల ఆధారంగా వృత్తిలో పోటీదారులెవరైనా ఈ సంఘటనకు ఉసిగొల్పారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. వైద్యుడి సమీప బంధువుపైనా సందేహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బాధితుడితో విభేదాలు ఉన్నవారిని కూడా అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో ఓ ప్రజాప్రతినిధి, ఇద్దరు పాత్రికేయుల పాత్ర ఉన్నట్లు చర్చ సాగుతోంది. సదరు వైద్యుడికి సంబంధించి చివరిసారిగా వచ్చిన ఒక ఫోన్ నంబర్ ఆధారంగా, ఆ నంబర్‌తో టచ్‌లో ఉన్నవారి వివరాలు, కాల్‌డాటా సైతం సేకరించినట్లు సమాచారం. ఇందులో హుజూరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు, తుమ్మనపల్లికి చెందిన ఒకరు, ఎల్కతుర్తి మండలానికి చెందిన ఇద్దరు, శంకరపట్నం మండలం ఎరుకలగూడెం, భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌కు చెందిన పలువురి నంబర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటన మొత్తానికి హుజూరాబాద్‌లోనే వ్యూహరచన జరిగినట్లు సమాచారం. వైద్యుడి పనివేళలు, వ్యక్తిగత వివరాలు తెలిసినవారే దీనికి కారణమవుతారని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. అనుమానితుల ఫోన్ కాల్‌డాటా సేకరించిటనట్లు తెలిసింది. ఇప్పటికే వారి చేతుల్లో కొంత కీలక సమాచారం ఉందని తెలిసింది. ఈ సస్పెన్స్‌కు రెండు రోజుల్లో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.