రాష్ట్రంలో పీడియాట్రిక్ సర్జన్ల కొరత
రాష్ట్రంలో పీడియాట్రిక్ సర్జన్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వంలోనే కాదు, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉన్న కొద్దిమందీ ప్రైవేటు ఆస్పత్రుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో చిన్నారులకు శస్త్రచికిత్సలు అందే పరిస్థితి లేకుండాపోయింది. మన రాష్ట్రంలో ఏటా 8 లక్షల పై చిలుకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో 3.80 లక్షలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరుగుతున్నట్టు ప్రభుత్వ అంచనా. చిన్న పిల్లలకు కనీసం ఐదేళ్ల వరకూ ఎలాంటి శస్త్రచికిత్సలైనా పీడియాట్రిక్ సర్జన్లే నిర్వహించాలి. అంటే మన రాష్ట్రంలో ఐదేళ్ల లోపు చిన్నారులు 30 లక్షల మందిపైనే ఉన్నారు. వీరిలో 20 లక్షల మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారే. వీరిలో 5 నుంచి 6 శాతం శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వాళ్లు వస్తున్నారు. కానీ, ఇక్కడ సర్జన్లు లేరు. సర్జన్ల కొరతతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలూ ఉన్నాయి.
30 లక్షల మందికి 10 మంది సర్జన్లా
ఈ సంఖ్య వింటేనే వైద్య వర్గాల్లోనే కాదు సామాన్యులు కూడా నోరెళ్లపెట్టే పరిస్థితి. రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులకు ఏటా 20 లక్షల మంది చిన్నారులు వస్తూండగా అందుబాటులో ఉండే పీడియాట్రిక్ సర్జన్లు10 మంది మాత్రమే. అంటే, రెండు లక్షల మందికి కూడా ఒక డాక్టరు లేరు. అదే ఎండీ పీడియాట్రిక్ డాక్టర్లు మాత్రం 91 మంది ఉన్నారు. వీళ్లు కేవలం పిల్లవాడి జబ్బు నిర్ధారణ చేయగలరు గానీ, శస్త్రచికిత్స చేయరు. దీనికోసం పీడియాట్రిక్సర్జనే ఉండాలి. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళుతున్నారు. పీడియాట్రిక్ సర్జరీపై చాలామంది వైద్యులు ఆసక్తి చూపడం లేదు. ఎంసీహెచ్ పీడియాట్రిక్ అనేది సూపర్ స్పెషాలిటీ కోర్సు. పీజీ తర్వాత చేయాల్సి ఉంటుంది. పైగా చిన్నపిల్లల సర్జరీకి డిమాండ్ తక్కువ. అందుకే నీలోఫర్ లాంటి ఆస్పత్రిలో 5 ఎంసీహెచ్ సీట్లు ఉంటే కూడా ఒక్కోసారి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా ఈ ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ తీసుకున్నా కోర్సు పూర్తవగానే కార్పొరేట్ ఆస్పత్రులకు వెళుతున్నారు.
వేతనాలు తక్కువని..
ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ సూపర్‌స్పెషాలిటీ కోర్సు. అయినా సరే పీజీ కోర్సు అయిన ఎండీ పీడియాట్రిక్ మీద ఆధారపడాలి. ఎండీలు సర్జరీకి చెబితేనే ఈయన చేయాలి. నేరుగా పేషెంట్లు వచ్చే పరిస్థితి ఉండదు. అదే జనరల్ సర్జనీ పీజీ కోర్సు అయినా పెద్దవాళ్లు వస్తారు. కానీ పిల్లల్లో ఎండీ చెబితేనే సర్జన్ వద్దకు వెళతారు. పైగా ప్రభుత్వంలో తక్కువ జీతాలు ఇస్తారు కాబట్టి పీడియాట్రిక్ సర్జన్లు మొగ్గుచూపరు.
-డాక్టర్ ఫణిమహేశ్వరరెడ్డి, జనరల్ సర్జన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ