Pharmacy council
-
కనుమరుగు కానున్న 75 ఏళ్లనాటి ఫార్మసీ కౌన్సిల్!
దేశంలో 75 ఏళ్ల నుంచి భారత ఫార్మసీ కౌన్సిల్ (PCI) కనుమరుగు కాబోతోంది. దీని స్థానంలో నేషనల్ ఫార్మసీ కమిషన్‌ను తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫార్మసీ చట్టం-1948 చట్టాన్ని భర్తీ చేసే నేషనల్ ఫార్మసీ కమిషన్ ముసాయిదా బిల్లు-2023 ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. నాణ్యమైన ఫార్మసీ విద్యను ఎక్కువ మందికి అందించడం, దేశవ్యాప్తంగా ఫార్మసీ నిపుణుల లభ్యతను పెంచడం ఈ బిల్లు లక్ష్యం. తాజా పరిశోధనలను ఏకీకృతం చేస్తూ ఫార్మసీ నిపుణులు తమ పరిశోధనలను మరింత మెరుగుపరుచుకునేలా, ఉన్నత నైతిక ప్రమాణాలను నిలబెట్టేలా ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది. ఫార్మసీ సంస్థల క్రమబద్ధమైన, పారదర్శక తనిఖీలు, జాతీయ ఫార్మసీ రిజిస్టర్ నిర్వహణ, ఎప్పటికప్పుడు వస్తున్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. నేషనల్ ఫార్మసీ కమిషన్‌లో చైర్‌పర్సన్‌తోపాటు 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు, 14 మంది తాత్కాలిక సభ్యులు ఉంటారు. ఈ కమిషన్ కింద పనిచేసేలా ఫార్మసీ ఎడ్యుకేషన్ బోర్డు, ఫార్మసీ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, ఫార్మసీ ఎథిక్స్ అండ్ రిజిష్ట్రేషన్ బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. -
ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షునిగా సంజయ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షునిగా ఆకుల సంజయ్‌రెడ్డి గురువారం ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన కౌన్సిల్ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఫార్మసీ సభ్యులతో ఎన్నికలు నిర్వహించగా, సభ్యులంతా సంజయ్‌రెడ్డిని ఎన్నుకున్నారు. -
డీ ఫార్మసీ విద్యార్థులకు ఎగ్జిట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీ ఫార్మసీ) చదివే విద్యార్థులకు ఎగ్జిట్ పరీక్ష తప్పనిసరి చేస్తూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. డీ ఫార్మసీ పూర్తిచేసిన విద్యార్థులు ఇకపై రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఫార్మసీ ప్రాక్టీస్ చేయాలన్నా ఎగ్జిట్ పరీక్ష తప్పనిసరిగా రాసి ఉత్తీర్ణులు కావాలంది. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో ఫార్మసిస్ట్‌గా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఫార్మసీ విద్య, డీ ఫార్మసీలో సమగ్ర శిక్షణ పొందారని నిర్ధారించడమే డీ ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ ఉద్దేశమని స్పష్టం చేసింది. నిర్దేశిత అథారిటీ ప్రకటించిన పరీక్ష షెడ్యూల్ ప్రకారం ఏటా రెండు సార్లు లేదా తరచు పరీక్ష నిర్వహిస్తారని తెలిపింది. రాష్ట్రంలోని ఫార్మసిస్ట్‌లుగా ఇప్పటికే నమోదైన వ్యక్తులకు కొత్త విధానం వర్తించదని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు ఆకుల సంజయ్ రెడ్డి వివరించారు. ఎగ్జిట్ పరీక్ష విధానం ఈ ఏడాది నుంచే అమలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫార్మసీలో పాసైతేనే ఎగ్జిట్ ఎగ్జామ్‌కు.. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విధానాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహిస్తారు. డీ ఫార్మసీలో ఉత్తీర్ణత అయితేనే ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామినేషన్‌కు అనుమతిస్తారు. ఎగ్జిట్ పరీక్షలో బహుళ ఎంపిక ప్రశ్నలున్న మూడు పేపర్లుంటాయి. ఇంగ్లిష్‌లో పరీక్ష ఉంటుంది. ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, హాస్పిటల్, క్లినికల్ ఫార్మసీ, ఔషధ దుకాణాల నిర్వహణపై ప్రశ్నలుంటాయి. అభ్యర్థి ఒకే ప్రయత్నంలో మూడు పేపర్లలో ఉత్తీర్ణత సాధించాలి. ఎన్రోల్మెంట్, ప్రాక్టీస్ కోసం అర్హత సర్టిఫికెట్‌ను జారీచేస్తారు. ఫార్మసిస్ట్‌గా నమోదు కోసం ఆ సర్టిఫికెట్‌ను రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌కు అందజేయాలి. -
క్రిమినల్స్‌ను ఎలా తీసుకుంటారు?
ఫార్మసీ కౌన్సిల్ తీరుపై మండిపడిన పీఏసీ చైర్మన్ బుగ్గన సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలను నిర్వీర్యం చేసి, ఇష్టారాజ్యంగా వాటిని వాడుకునే హక్కు మీకెవరిచ్చారని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ (పీఏసీ) బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ కార్యాలయంలో గురువారం పీఏసీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఫార్మసీ కౌన్సిల్లో క్రిమినల్స్‌ను ఎలా నామినేట్ చేస్తారని ప్రశ్నించారు. ఒక వ్యక్తి మర్డర్ కేసులో 90 రోజులు రిమాండ్ ఖైదీగానూ, మరో వ్యక్తి ఫోర్జరీ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. వీళ్లిద్దరినీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులుగా నామినేట్ చేశారు. దీనిపై పీఏసీ సమావేశంలో చైర్మన్ తీవ్రంగా ప్రశ్నించారు. తన హయాంలో కేసులు ఉన్న వారిని నియమించలేదని, దీనిపై విచారించి నివేదిక ఇస్తానని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఇప్పటికే ఫార్మసీ కౌన్సిల్‌పై లిటిగేషన్లు ఉన్నాయని, కోర్టు కేసులున్నాయని, ఈ వ్యాజ్యాలు పరిష్కారమవగానే నిర్వహణ సవ్యంగా సాగిస్తామని ఔషధ నియంత్రణ మండలి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సమాధానమిచ్చారు. వారం రోజుల్లో ఫార్మసీ కౌన్సిల్‌పై పూర్తిస్థారుు నివేదిక ఇవ్వాలని పీఏసీ చైర్మన్ ఆదేశించారు. వైఎస్సార్ సేవాదళ్ పటిష్టతకు చర్యలు: వైఎస్సార్ సేవాదళ్‌ను కింది స్థాయి నుంచి పటిష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి దళ్ సమావేశంలో సంస్థాగత అంశాలపై చర్చ జరిగింది. దళ్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఎమ్మెల్యే) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు. -
‘ఫార్మసీ’ అక్రమాలపై విచారణకు గవర్నర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఉమ్మడిగా కొనసాగుతున్న ఫ్మార్మసీ కౌన్సిల్లో నెలకొన్న అక్రమాలపై గవర్నర్ నరసింహన్ విచారణకు ఆదేశించారు. ఫార్మసీ కౌన్సిల్లో జరుగుతున్న అక్రమాలపై గవర్నర్‌కు పలు ఫిర్యాదులు అందాయి. ఔషధ నియంత్రణ మండలిలో డ్రగ్ ఇన్స్పెక్టర్గా పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, పదవీ విరమణ చేసిన అధికారిని రిజిస్ట్రార్‌గా కొనసాగిస్తున్నారని, తక్షణమే ఆయనను తొలగించాలని కొంతమంది ఫార్మసిస్ట్‌లు గవర్నర్‌కు వివరించారు. తమ నుంచి చేస్తున్న అక్రమ వసూళ్లకు తక్షణమే బ్రేక్ పడేలా చూడాలని కూడా వారు ఫిర్యాదులో అభ్యర్థించారు. దీనికి స్పందించిన గవర్నర్.. ఫార్మసీ కౌన్సిల్ అక్రమాలపై విచారణకు ఆదేశించారు. విచారణాధికారులుగా ఔషధ నియంత్రణ మండలి డెరైక్టర్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి బీఎల్ మీనా, తెలంగాణ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ పుట్టా శ్రీనివాస్‌లను నియమించారు. త్వరలోనే నివేదిక: ఫార్మసీ కౌన్సిల్ అక్రమాలపై త్వరలోనే విచారణ ప్రారంభిస్తామని విచారణాధికారి పుట్టా శ్రీనివాస్ తెలిపారు. ఇదిలావుంటే, తనను సాక్షిగా విచారించాలంటూ ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు అన్నపురెడ్డి విజయభాస్కర్‌రెడ్డి విచారణాధికారులకు లేఖ రాశారు. తనను విచారిస్తే మరిన్ని లొసుగులు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. మరోపక్క, కౌన్సిల్లో ఎలాంటి అక్రమాలూ జరగలేదని, ఉన్నతాధికారుల అనుమతితోనే రిజిస్ట్రేషన్ క్యాంప్‌లు పెట్టామని రిజిస్ట్రార్ పోలా నాగరాజు ‘సాక్షి’కి చెప్పారు. ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ల పేరిట డి-ఫార్మసీ, బి-ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి కొందరు వేలాది రూపాయలు అక్రమంగా వసూలు చేశారని ఫార్మాసిస్ట్లు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరినుంచి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకూ వసూళ్లు చేశారని అంటున్నారు. రెన్యువల్ చేసుకోవాల్సి ఉండి, గడువులోగా చేసుకోని వారినుంచి కూడా డబ్బు గుంజారని తెలిపారు. ఇంటివద్దకే రిజిస్ట్రేషన్ పేరుతో పలు పట్టణాల్లో కౌంటర్లు పెట్టి మరీ అభ్యర్థుల నుంచి వసూలు చేశారు. గతంలో ఫార్మసిస్ట్‌ల నుంచి పాలకమండలిని ఎన్నుకున్నా, ఆ సభ్యులెవరికీ కౌన్సిల్లో ప్రమేయం లేకుండా చేశారు. దీంతో ఇప్పటికీ అక్రమ వసూళ్లు నడుస్తున్నాయి.