క్రిమినల్స్‌ను ఎలా తీసుకుంటారు?
క్రిమినల్స్‌ను ఎలా తీసుకుంటారు?
Published Fri, Nov 25 2016 2:33 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
ఫార్మసీ కౌన్సిల్ తీరుపై మండిపడిన పీఏసీ చైర్మన్ బుగ్గన
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలను నిర్వీర్యం చేసి, ఇష్టారాజ్యంగా వాటిని వాడుకునే హక్కు మీకెవరిచ్చారని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ (పీఏసీ) బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ కార్యాలయంలో గురువారం పీఏసీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఫార్మసీ కౌన్సిల్‌లో క్రిమినల్స్‌ను ఎలా నామినేట్ చేస్తారని ప్రశ్నించారు. ఒక వ్యక్తి మర్డర్ కేసులో 90 రోజులు రిమాండ్ ఖైదీగానూ, మరో వ్యక్తి ఫోర్జరీ కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. వీళ్లిద్దరినీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులుగా నామినేట్ చేశారు.
దీనిపై పీఏసీ సమావేశంలో చైర్మన్ తీవ్రంగా ప్రశ్నించారు. తన హయాంలో కేసులు ఉన్న వారిని నియమించలేదని, దీనిపై విచారించి నివేదిక ఇస్తానని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఇప్పటికే ఫార్మసీ కౌన్సిల్‌పై లిటిగేషన్‌లు ఉన్నాయని, కోర్టు కేసులున్నాయని, ఈ వ్యాజ్యాలు పరిష్కారమవగానే నిర్వహణ సవ్యంగా సాగిస్తామని ఔషధ నియంత్రణ మండలి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సమాధానమిచ్చారు. వారం రోజుల్లో ఫార్మసీ కౌన్సిల్‌పై పూర్తిస్థారుు నివేదిక ఇవ్వాలని పీఏసీ చైర్మన్ ఆదేశించారు.
వైఎస్సార్ సేవాదళ్ పటిష్టతకు చర్యలు: వైఎస్సార్ సేవాదళ్‌ను కింది స్థాయి నుంచి పటిష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి దళ్ సమావేశంలో సంస్థాగత అంశాలపై చర్చ జరిగింది. దళ్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఎమ్మెల్యే) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement