15 ఏళ్లకే పీహెచ్డీ చేస్తోంది!!
సాధారణంగా 15 ఏళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? టెంత్ క్లాస్ పరీక్షలు రాసి.. కాలేజీకి వెళ్తున్నామన్న సంబరంలో ఉంటారు కదూ. కానీ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుష్మా వర్మ 15 ఏళ్లకే పీజీ పూర్తి చేయడమే కాదు, ఏకంగా ఇప్పుడు పీహెచ్డీ కూడా మొదలుపెడుతోంది. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ యూనివర్సిటీలో పర్యావరణ మైక్రోబయాలజీలో ఆమె పరిశోధన చేయనుంది. అలాగని ఈమె చిన్నతనం నుంచి సకల సౌకర్యాల మధ్య చదువుకుందని అనుకుంటున్నారా? కాదు.. ఆమె ఓ సామాన్య పారిశుధ్య కార్మికుడి కూతురు. ఈ ఏడాదే ఆమె ఎంఎస్సీ మైక్రోబయాలజీలో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది.
పీహెచ్‌డీకి సంబంధించిన ప్రవేశ పరీక్షలో కూడా ఆమె ఏడోర్యాంకు పొందింది. అయితే ప్రస్తుతం మైక్రోబయాలజీ విభాగంలో కేవలం నాలుగు సీట్లే ఖాళీ ఉన్నాయని, ఈమె కోసం ప్రత్యేకంగా అదనపు సీటు కేటాయించాల్సి వస్తుందని ఆ శాఖాధిపతి నవీన్ కుమార్ అన్నారు. ప్రత్యేక విభాగంలో ఆమెకు తప్పనిసరిగా పీహెచ్డీ అడ్మిషన్ ఇస్తామని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఆర్ఎస్ సోబ్తి తెలిపారు. 15 ఏళ్ల చిరుప్రాయంలో ఎవరూ అందుకోనంత ఎత్తుకు వెళ్లిందని ఆయన అన్నారు. ఆమెకు హాస్టల్ సీటు, స్కాలర్ షిప్ కూడా ఇస్తామని తెలిపారు.