‘ఫోరమ్ మాల్’లో కరిష్మా సందడి
హెల్త్ అండ్ గ్లో పోటీల విజేతలతో ముచ్చటించిన బాలీవుడ్ భామ
సాక్షి, బెంగళూరు : తన గ్లామర్‌తో బాలీవుడ్ సినీ అభిమానులను ఉర్రూతలూగించిన భామ కరిష్మా కపూర్. వివాహం అనంతరం ఆమె సినిమాలకు కాస్తంత దూరంగానే ఉన్న సినీ అభిమానుల్లో కరిష్మాకపూర్కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అలాంటి అందాల తార కరిష్మా కపూర్ నగరంలోని ఫోరమ్మాల్లో బుధవారం సందడి చేశారు. ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ హెల్త్ అండ్ గ్లో సంస్థ నిర్వహించిన ‘హెల్త్ అండ్ గ్లో’ పోటీల్లో విజేతలైన యువతులతో ముచ్చటించేందుకు కరిష్మా కపూర్ నగరానికి వచ్చారు.
హెల్త్ అండ్ గ్లో పోటీల్లో విజేతలుగా నిలిచిన పది మంది అమ్మాయిలను ఆమె స్వయంగా అభినందించారు. విజేతలైన వారిలో నగరానికి చెందిన షీతల్, రేవతి, పుష్ప, శ్వేత, గీతాప్రియ, జయంతి, నళినిలతో పాటు హైదరాబాద్‌కు చెందిన మౌనికా వర్థన్, ముంబైకి చెందిన నీతా మాలిక్, చెన్నైకి చెందిన రమ్య సుందరరాజ్‌లు ఉన్నారు. విజేతలుగా నిలిచిన యువతులతో కరిష్మాకపూర్ పిచ్చాపాటి ముచ్చటించారు. అనంతరం కరిష్మా కపూర్ మాట్లాడుతూ... ఇంతకాలం తనపై ఆదరాభిమానాలను చూపిస్తూ వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.