ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
విజయనగరం కంటోన్మెంట్: పేద కుటుంబాలకు శుభవార్త. ఇక గ్యాస్ కనెక్షన్ కోసం వేలాది రూపాయలు ఖర్చుచేయనక్కరలేదు. కేవలం రూ.10లు చెల్లిస్తే చాలు. కనెక్షన్ మంజూరు చేస్తారు. జిల్లాకు 21 వేల ఉచిత కనెక్షన్లు మంజూరయ్యాయి. వీటిని పొందడానికి మీసేవలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె నిర్మలాబాయి తెలిపారు. జిల్లాలో ఇంతవరకూ గ్యాస్ కనెక్షన్ కానీ, దీపం పథకం కింద పొందిన కనెక్షన్ పొందని వారికి మాత్రమే ఈ ఉచిత కనెక్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
దీనికి సంబంధించి కనెక్షన్లు ఇచ్చేందుకు ఆ యిల్ కంపెనీలు కూడా అంగీకరించాయని, తెల్లకార్డు కలిగిన పేదలకు వీటిని అందజేస్తామని చెప్పారు. దరఖాస్తుదారుల వివరాలను అప్లోడ్ చేసేందుకు ఫ్రక్స్ సొల్యూషన్స్ సంస్థ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోందని, మరో నాలుగు రోజుల్లో ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ నెల 21 నుంచి అర్హులైన దరఖాస్తుదారులు రూ.10 చెల్లించి మీసేవల్లో దరఖాస్తు చేసుకోవాలని డీఎస్ఓ తెలిపారు. కనెక్షన్ మంజూరైన వారు రెగ్యులేటర్, సిలిండర్లకు ఎటువం టి డిపాజిట్ చెల్లించక్కరలేదని ఆయన స్పష్టం చేశారు. గ్యాస్ కంపెనీల వద్ద స్టవ్‌లను కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా లేదని, వారికి నచ్చిన చోట నాణ్యమైన స్టవ్‌ను కొనుగోలు చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించామన్నారు