Phulpur
-
మాయావతి ముందుచూపు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ అభ్యర్థులను బలపర్చాలని బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి నిర్ణయం తీసుకోవడం చాలా చిన్న విషయంగానే కనిపిస్తుందిగానీ అది చాలా పెద్ద విషయం. ఇది భవిష్యత్ కొత్త రాజకీయ సమీకరణలకు దారితీసే అంశం. పైగా ఇది మాయావతి సహజ వైఖరికి పూర్తి భిన్నంగా తీసుకున్న నిర్ణయం. ఆమె రాజకీయ గురువు కాన్షీరావు 1993లో సమాజ్వాది పార్టీ, బీఎస్పీకి మధ్యన పొత్తు కుదిర్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆమె ఏనాడు ఎస్పీతో పొత్తుకు మొగ్గు చూపలేదు. నాడు ఆ పొత్తు వల్ల రామ మందిరం ఉద్యమంతో మంచి ఊపు మీదున్న బీజేపీని ఓడించగలిగారు. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఇరు పార్టీల మధ్య అవగాహన కుదురడం విశేషం. 1996లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాన్షీరామ్ మరోసారి పొత్తు ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఆ సారీ కాంగ్రెస్ పార్టీతో. మాయావతి ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కాన్షీరామ్ వినిపించుకోలేదు. ఆ పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీ లాభ పడిందిగానీ బీఎస్పీ కాదు. అప్పటి నుంచి కాన్షీరామ్ పార్టీ విధాన నిర్ణయాలను మాయావతికే వదిలేశారు. అప్పటి నుంచి ఆమె ఎన్నికల అనంతరం పొత్తుల ద్వారా ముఖ్యమంత్రి అవుతూ వచ్చారు. 2007లో మాయావతి ఎవరి మీద ఆధాపడకుండా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సంపూర్ణ మెజారిటీ సాధించారు. ఆ తర్వాత బలహీన పడుతూ వచ్చిన ఆమె పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మరీ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎస్పీతో పొత్తుకు మొగ్గుచూపారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆమె ఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని ఆమె పార్టీ వర్గాలే చెబుతున్నాయి. రాజ్యసభ సభ్యురాలుగా కేంద్ర రాజకీయల్లో రాణించిన మయావతి ఏప్రిల్లో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసి రాజ్యసభకు వెళతారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ద్వారా పార్లమెంట్లో బలం పెంచుకోవాలని చూస్తున్నారని ఆ వర్గాలు అంటున్నారు. రెండు లోక్సభ ఉప ఎన్నికల్లో సమాజ్ వాది అభ్యర్థులకు మద్దతిస్తున్నందుకు బదులుగా రాజ్యసభ ఎన్నికల్లో మాయావతి లేదా ఆమె సూచించిన పార్టీ అభ్యర్థికి సమాజ్వాది పార్టీ మద్దతు ఇవ్వాలని అవగాహన కుదుర్చుకున్న విషయం తెల్సిందే. -
అయ్యో...పాపం కైఫ్!
విదేశీ, స్వదేశీ మైదానాల్లో తన ఫీల్డింగ్, బ్యాటింగ్ తో ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మహ్మద్ కైఫ్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ఫల్పూర్ నియోజకవర్గంలో ప్రత్యర్ధుల దాటికి తట్టుకోలేక డిఫెన్స్ ఆడాల్సి వస్తుంది. క్రికెట్ రంగం నుంచి రాజకీయాల్లోకి దిగుమతైన కైఫ్ ప్రస్తుతం భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రాతినిద్యం వహించిన సీటు నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో కైఫ్ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయడంపై అతని సహచరులు, స్థానిక నేతలే పెదవి విరుస్తున్నారు. 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచిన దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్ధానంలో నిలిచింది. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన కపిల్ ముని కర్వారియా ఈ స్థానంలో గెలుపొందారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేస్తూ కైఫ్ ధీటైన పోటి ఇస్తున్నారు. ఇక మోడీ హవాతో కేశవ్ ప్రసాద్ మౌర్య బీజేపీ తరపున రంగంలో ఉన్నారు. లక్నో పట్టణానికి సమీపంలో ఉన్న ఫల్పూర్ నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్ధుల ఎదుర్కోవడమే కష్టంగా మారిన నేపథ్యంలో స్థానిక నేతలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సరైన మద్దతు ఇవ్వకపోవడంతో కైఫ్ కష్టకాలం మొదలైంది. కైఫ్ ప్రసంగాలు చప్పగా సాగుతుండటంతో ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమవ్వడమే కాకుండా, గెలుపు కోసం శ్రమించాల్సిన అవసరం లేకుండా చేతులెత్తేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నింటికి . కైఫ్ ప్రచారం కూడా బొసి పోయినట్టు కనిపిస్తోంది. ఘన చరిత్ర ఉన్న ఫల్పూర్ స్తానానికి కైఫ్ ఏ కోణంలోనైనా సరియైన అభ్యర్ధి కాదనే వాదన వినిపిస్తోంది. కైఫ్ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన తర్వాత కొంత ఉత్సాహం కనిపించింది. అయితే కనీసం ఓటు అడగడానికైనా కైఫ్ కనిపించకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం తుస్సుమంది. ఈ నియోజకవర్గంలో మద్దతు కరువైంది. ఓసారి లైన్ దాటిన తర్వాత ప్రత్యర్ధి బౌలర్లను ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వస్తుంది అని కైఫ్ అనడం చూస్తే ఎందుకు పోటీ చేస్తున్నాననే భావన స్పష్టం కనిపిస్తోంది. క్రికెట్ లో ప్రతికూల పరిస్థితులను అధిగమించిన కైఫ్ రాజకీయ రంగంలో కూడా అలాంటి ఒడిదుకులను దాటుతారా అనే ప్రశ్నకు మే 7 తేదిన జరిగే ఎన్నికల తర్వాత స్పష్టమవ్వడం ఖాయం. క్రికెట్ రంగంలో హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న కైఫ్.. రాజకీయ రంగంలో అలాంటి ఇమేజ్ సొంతం చేసుకుంటారా అనేది త్వరలోనే తెలుస్తుంది.