అయ్యో...పాపం కైఫ్!
అయ్యో...పాపం కైఫ్!
Published Tue, May 6 2014 1:07 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
విదేశీ, స్వదేశీ మైదానాల్లో తన ఫీల్డింగ్, బ్యాటింగ్ తో ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మహ్మద్ కైఫ్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ఫల్పూర్ నియోజకవర్గంలో ప్రత్యర్ధుల దాటికి తట్టుకోలేక డిఫెన్స్ ఆడాల్సి వస్తుంది. క్రికెట్ రంగం నుంచి రాజకీయాల్లోకి దిగుమతైన కైఫ్ ప్రస్తుతం భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రాతినిద్యం వహించిన సీటు నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో కైఫ్ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయడంపై అతని సహచరులు, స్థానిక నేతలే పెదవి విరుస్తున్నారు. 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచిన దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్ధానంలో నిలిచింది. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన కపిల్ ముని కర్వారియా ఈ స్థానంలో గెలుపొందారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేస్తూ కైఫ్ ధీటైన పోటి ఇస్తున్నారు. ఇక మోడీ హవాతో కేశవ్ ప్రసాద్ మౌర్య బీజేపీ తరపున రంగంలో ఉన్నారు.
లక్నో పట్టణానికి సమీపంలో ఉన్న ఫల్పూర్ నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్ధుల ఎదుర్కోవడమే కష్టంగా మారిన నేపథ్యంలో స్థానిక నేతలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సరైన మద్దతు ఇవ్వకపోవడంతో కైఫ్ కష్టకాలం మొదలైంది. కైఫ్ ప్రసంగాలు చప్పగా సాగుతుండటంతో ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమవ్వడమే కాకుండా, గెలుపు కోసం శ్రమించాల్సిన అవసరం లేకుండా చేతులెత్తేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నింటికి . కైఫ్ ప్రచారం కూడా బొసి పోయినట్టు కనిపిస్తోంది. ఘన చరిత్ర ఉన్న ఫల్పూర్ స్తానానికి కైఫ్ ఏ కోణంలోనైనా సరియైన అభ్యర్ధి కాదనే వాదన వినిపిస్తోంది. కైఫ్ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన తర్వాత కొంత ఉత్సాహం కనిపించింది. అయితే కనీసం ఓటు అడగడానికైనా కైఫ్ కనిపించకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం తుస్సుమంది.
ఈ నియోజకవర్గంలో మద్దతు కరువైంది. ఓసారి లైన్ దాటిన తర్వాత ప్రత్యర్ధి బౌలర్లను ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వస్తుంది అని కైఫ్ అనడం చూస్తే ఎందుకు పోటీ చేస్తున్నాననే భావన స్పష్టం కనిపిస్తోంది. క్రికెట్ లో ప్రతికూల పరిస్థితులను అధిగమించిన కైఫ్ రాజకీయ రంగంలో కూడా అలాంటి ఒడిదుకులను దాటుతారా అనే ప్రశ్నకు మే 7 తేదిన జరిగే ఎన్నికల తర్వాత స్పష్టమవ్వడం ఖాయం. క్రికెట్ రంగంలో హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న కైఫ్.. రాజకీయ రంగంలో అలాంటి ఇమేజ్ సొంతం చేసుకుంటారా అనేది త్వరలోనే తెలుస్తుంది.
Advertisement