ఆరోగ్యాంధ్ర అంటే ఇదేనా సీఎం గారూ?
పరిసరాలతో పాటు ప్రజల మైండ్ కూడా పరిశుభ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆరోగ్యాంధ్రపై అందరికీ అవగాహన అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే.. ముఖ్యమంత్రి కార్యక్రమం ముగిసిన కాసేపటి తర్వాత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. నినాదాలతో కూడిన ప్లకార్డులు, కాగితాలు అన్నీ ఎక్కడికక్కడ రోడ్లమీద పారేశారు. రోడ్ల మీద ఎక్కడ చూసినా దోమలపై దండయాత్ర పరిసరాల పరిశుభ్రత గురించిన ప్లకార్డులు, చిన్న చిన్న పాంప్లెట్లు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి.
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు ఎంతో మంచి జిల్లాలని, ప్రశాంతతకు మారుపేరని, అందుకే ఈ జిల్లాలంటే తనకు ఎంతో ఇష్టమని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు చెప్పారు. అలిపిరి ఘటన నుంచి ఒక డెస్టినీ కోసం భగవంతుడు తనను కాపాడాడని ఆయన అన్నారు. ఈవాళ హైదరాబాద్లో మత కల్లోలాలు లేవంటే.. తాను అడ్డుకట్ట వేయడం వల్లేనని చెప్పారు. మొత్తానికి ముఖ్యమంత్రి పరిశుభ్రత గురించి ఎన్ని పాఠాలు చెప్పినా.. చివరకు కాకినాడ రోడ్లు మాత్రం పరమ చెత్తగా మారిపోవడం గమనార్హం.