పోలీసులపై తెలుగు తమ్ముళ్ల దాడి
నూజివీడు: అధికారంలో ఉన్నామనే అహంకారంతో కృష్ణాజిల్లాలో తెలుగు తమ్ముళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఆగిరిపల్లిలో పోలీసులపై దాడికి తెగబడ్డారు. టీడీపీ చెందిన రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకాలు చేయాలని పోలీసులు చెప్పడంతో తమ్ముళ్లకు ఆగ్రహం వచ్చింది. ఆగిరిపల్లి ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తమను స్టేషన్కు రమ్మంటారా అని రౌడీషీటర్లు శ్రావణ్ కుమార్, నవీన్ వీరంగం సృష్టించారు.
టీడీపీ నాయకుడు పాలేటి ఉమా మహేశ్వరరావు అలియాస్ పింకీ నేతృత్వంలో 20 మంది కలిసి మారణాయుధాలతో పోలీసులపై దాడి చేశారు. ఎస్ఐ రాజేంద్రప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ సతీష్ కుమార్, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుపై నడిరోడ్డుపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఆగిరిపల్లి బయల్దేరి వెళ్లారు.
ఉమామహేశ్వరరావు మండవల్లిలో రౌడీషీటర్ అని, భూకబ్జాలు.. సెటిల్మెంట్లు చేసే అతడిపై చాలా కేసులు ఉన్నాయని ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తాను వచ్చాక అడ్డుకోవడంతో తనమీద కక్ష పెంచుకున్నారని చెప్పారు. ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షిస్తూ.. స్టేషన్కు వచ్చి వాళ్లను సమాచారం ఇవ్వాలని కోరగా, 'మేం రౌడీషీటర్లమని నువ్వెవడురా చెప్పడానికి' అంటూ బూతులు తిట్టారని, దీనిపై తాను తన ఉన్నతాధికారులకు చెప్పానని ఎస్ఐ అన్నారు. తర్వాత పాలేటి ఉమా కారులో మారణాయుధాలు తీసుకుని వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని తెలిపారు. దాడిలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయన్నారు.