పక్కాగా పీఎంఎస్ఏ విధానం అమలు
నెల్లూరు(అర్బన్): ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్(పీఎంఎస్ఎ) కార్యక్రమం ద్వారా ప్రతి నెలా తొమ్మిదో తేదీన గర్భిణులకు స్కానింగ్, రక్తపరీక్షలు చేయించి మందులను అందజేసి వారిని ఇంటి వద్దకు చేర్చాలని డీఎంహెచ్ఓ వరసుందరం సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆశ నోడల్ ఆఫీసర్లకు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎంఎస్ఎ కార్యక్రమం కింద గర్భిణులకు భోజనం, ప్రయాణ వసతులను కల్పించాలని కోరారు. ఆశ వర్కర్లకు ఇస్తున్న పారితోషికాలను నోటీస్ బోర్డుల్లో ఉంచాలని సూచించారు. గ్రామస్థాయిలో ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య శిక్షణ మండలి అధికారి పెద్దిశెట్టి రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.