బోన మెత్తిన ఇందూరు
జిల్లా కేంద్రంలో బోనాల పండగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకుని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు.
కరుణను వర్షించు తల్లీ
నిజామాబాద్ కల్చరల్ : వర్షాలను సమృద్ధిగా కురిపించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ప్రార్థిస్తూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం నగరంలో బోనాల పండుగ నిర్వహించారు. పోచమ్మగల్లి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మగల్లి సంఘం వద్ద బోనాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి స్థానిక పెద్దపోచమ్మ దేవాలయం, దేవిరోడ్డులోని చిన్న పోచమ్మ(దేవిమాత) ఆలయం, వినాయక్‌నగర్‌లోని ఐదు చేతుల పోచమ్మతల్లి, మత్తడి పోచమ్మతల్లి, మహాలక్ష్మీనగర్‌లోని మహాలక్ష్మి ఆలయం వరకు బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు.
అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నగర అధ్యక్షుడు ఈర్ల రవీందర్, కార్యదర్శి లక్ష్మీనారాయణ, సభ్యులు జాలిగం గోపాల్, అంబెం సాయిలు, సతీశ్, ఈర్ల శేఖర్, ఈర్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.