Pocharam Wildlife Sanctuary
-
Pocharam Wildlife Sanctuary: అందాలు అదరహో
మెదక్: చెంగుచెంగున దుంకే కృష్ణ జింకలు.. పురివిప్పి నాట్యం చేసె నెమళ్లు.. పక్షుల కిలకిలరావాలు.. చుట్టూ కనుచూపు మేరకు పరుచుకున్న పచ్చదనం.. ఇలా పోచారం అభయారణ్యం అందాలు కనువిందు చేస్తున్నాయి. అభయారణ్యానికి అనుకుని ఉన్న పోచారం ప్రాజెక్టుతో అక్కడికి వెళుతున్న సందర్శకుల ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మెదక్ జిల్లా కేంద్రానికి కేవలం 15కిలోమీటర్ల దూరంలోని మెదక్-బోధన్ రహదారికి అనుకుని ఉంది. ఈ పోచారం అభయారణ్యం. రాష్ట్ర రాజధానికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ప్రతిరోజు పెద్ద సంఖ్య సందర్శకులు ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. వారాంతాల్లో ఈ సందర్శకుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బోధన్ ప్రాంతాల నుంచి సందర్శకులు ఈ అభయారణ్యానికి వస్తుంటారు నీల్గాయిలు.. కొండగొర్లు.. ఈ అభయారణ్యంలో చుక్కలజింకలు, సాంబార్లు, నీల్గాయిలు, గడ్డిజింకలు, నెమళ్లు, అడవిపందులు, కొండగొర్లతో పాటు అనేక రకాల పక్షులు దర్శనమిస్తుంటాయి. ఈ అడవి 164 హెక్టార్ల మేర ఉండగా దాన్ని చుట్టూ కంచె వేశారు. ఆ కంచె లోపల జంతువులను పెంచుతున్నారు. అడవిలోని జంతువులను తిలకించేందుకు 4.5 కిలోమీటర్ల మేర ఉన్న రహదారి వెంట వెళ్తే అడవిలోని జంతువులను తిలకించవచ్చు. అరణ్యంలోని కారు, జీపు లాంటి వాహనాలపై వెళ్లవచ్చు. అభయారణ్యంలోకి ప్రవేశించగానే ఈ వన్యప్రాణులు కళ్ల ముందు కదలాడుతుంటాయి. అటవీ అందాలను వీక్షించేందుకు మూడు వాచ్ టవర్లు నిర్మించారు. వాటి పైకి ఎక్కి చూస్తే కనుచూపు మేరలో పచ్చటి అందాలు మన కళ్లకు దర్శనమిస్తాయి. అభయారణ్యం వద్ద గేస్ట్హౌజ్ ప్రాంగణంలో పక్కన చిన్నపిల్లల ఆటవిడుపు కోసం రకరకాల ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. పోచారం ప్రాజెక్టు.. ఈ అభయారణ్యం ఆనుకుని చుట్టూ కొండల మధ్య పోచారం ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు నిండుకుండలా నీటితో కళకళలాడుతుంది. ఈ ప్రాజెక్టులో బోటు శికారు చేస్తూ సందర్శకులు అహాల్లాదాన్ని పొందుతున్నారు. ఈ ప్రాజెక్టు చుట్టూ పచ్చని చెట్లు నిజాం పాలనలో నిర్మించిన ఐబీ అతిథిగృహం ఉంది. -
మెదక్‌లో అరుదైన జీవజాతి.. మూషిక జింకలు
సాక్షి, మెదక్: అరుదైన జీవ జాతుల్లో మూషిక జింక ఒక్కటి. ప్రభుత్వం వీటి మనుగడకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటి పునరుత్పత్తికి అభయారణ్యాల పరిధిలో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మెతుకుసీమగా పేరుగాంచిన మెదక్ జిల్లాలోని పోచారం అభయారణ్యంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మెదక్ జిల్లాకు 15 కిలోమీటర్లు.. హైదరాబాద్‌కు 115 కి.మీల దూరంలో ఉన్న పోచారం అభయారణ్యంలో అందమైన సరస్సుతో పాటు అపారమైన జంతు, వృక్ష జాతులు ఉన్నాయి. 1989లో ఈ అభయారణ్యం పరిధిలోని పర్యావరణ పర్యాటక కేంద్రంలో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. మొత్తం 158 హెక్టార్ల అటవీ స్థలాన్ని రెండు బ్లాక్‌లుగా విభజించారు. 124 హెక్టార్లలో ఒక బ్లాక్, 34 హెక్టార్లలో మరో బ్లాక్‌గా ఏర్పాటు చేసి జింకల సంరక్షణ చేపట్టారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం చుక్కల దుప్పులు 350 నుంచి 450, మనుబోతులు 8 నుంచి 10, సాంబార్ దుప్పులు సైతం 8 నుంచి 10, కొండ గొర్రెలు 12 వరకు ఉన్నాయని జిల్లా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. (చదవండి: పత్తిపై ‘గులాబీ’ పంజా) చిల్కూరు, నెహ్రూ పార్కు తర్వాత ఇక్కడే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని డీర్ పార్కులో మూషిక జింక సంతతి పెంపునకు అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులు చేసిన ప్రయోగం ఫలించింది. మూడేళ్ల క్రితం నాలుగు మూషిక జింకలను ఆ పార్కులో వదలగా.. గత ఏడాది ఓ మూషిక జింక పురుడు పోసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వీటి పునరుత్పత్తికి చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సమీపంలోని చిల్కూరు మృగవాణి నేషనల్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ రెండు మగ, ఆరు ఆడ మూషిక జింకలను వదిలారు. ఆ తర్వాత నెహ్రూ జూపార్క్‌లో రెండు మగ, నాలుగు ఆడ మూషిక జింకలను వదిలి.. పునరుత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించారు. అదేవిధంగా మెదక్ జిల్లాలోని పోచారంలో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రంలో మూషిక జింకలను వదిలేందుకు రంగం సిద్ధమైంది. రూ.5 లక్షల వ్యయంతో ఎన్‌క్లోజర్ నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. కాగా, జిల్లా అటవీ శాఖ అధికారిణి పద్మజారాణిని సంప్రదించగా.. ఎన్‌క్లోజర్ నిర్మాణం పూర్తయిన వెంటనే మూషిక జింకలు వస్తాయని తెలిపారు. పర్యాటకులు, సందర్శకుల సౌకర్యార్థం కేంద్రం లోపల ప్రత్యేక వాహనంలో తిరిగేలా 4.5 కి.మీల మేర మట్టి ట్రాక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుమతి మేరకే వాహనాల్లో వెళ్లి చూడొచ్చని పేర్కొన్నారు. -
పోచారం అభయారణ్యంలో ఆరు చిరుతలు
మెదక్: మెదక్ మండలం పోచారం వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో వన్యప్రాణుల గుర్తింపు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. అయిదు రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు ఆరు చిరుతలను గుర్తించారు. మెదక్ మండలం రాజిపేట బీట్‌లో రెండు రామాయంపేట మండలం పర్వతాపూర్ బీట్‌లో రెండు, నిజామాబాద్ జిల్లా పెద్దాయిపల్లి బీట్‌లో రెండు చిరుతలు మొత్తం ఆరు ఉన్నట్లు తేల్చారు. తాగునీటి వనరుల వద్ద అడుగులు, మలమూత్రాల ఆధారంగా వీటి జాడలను పసిగడుతున్నట్లు అధికారులు తెలిపారు.