అవధానం: కవిసింహుని కాఫీ దండకం!
పటాన్చెర్వు వాసి ‘కొలచెల్మ’ తొలి అవధాని!
మహాకవి కాళిదాసు సాహిత్యాన్ని వివరిస్తూ వ్యాఖ్యానం రాసిన వ్యక్తి కొలచెల్మ మల్లినాథసూరి. ఆయన పరిచయం లేకపోతే బహుశా తెలుగు వారికి కాళిదాసు తెలిసి ఉండేవారు కాదు. నేటికీ ఆయన వ్యాఖ్యానమే కాళిదాసు సాహిత్యానికి ప్రామాణికం. వీరి తాతగారు కూడా మల్లినాథసూరే (క్రీ.శ.1295-1323)! ఆయన రుద్రమదేవికి పూర్వుడు కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. కాకతి ప్రతాపరుద్రుడు కొలిచెల్మకు కనకాభిషేకం చేసిన వైనాన్ని ఒక శ్లోకం తెలియజేస్తుంది. కొలచెల్మాన్వయాబ్దీందు మల్లినాథో మహాశయా శతావధాన విఖ్యాతో వీరరుద్రాభివర్షితం
ఈ శ్లోకం తెలుగువారి శతావధానాలకు సంబంధించిన తొలి ఆధారం. ‘కొలిచెల్మ’ వారు మెదక్జిల్లా పఠాన్చెర్వు ప్రాంతం వారని అందరూ అంగీకరిస్తోన్న అంశం. తాపీకి కవిసింహుడి కాఫీ దండకం! ప్రబంధయుగం తర్వాత ఆధునిక యుగంలో ప్రత్యర్థి కావ్యం రచించిన కవి, పోకూరి కాశీపతి (1892-1974) మాత్రమే! ఆస్వాదించగల శక్తిని బట్టి ఆయన విరచిత ‘సారంగధరీయం’లో పార్వతీకల్యాణం-తారా శశాంకం-సారంగధరీయం పాఠకులను అలరిస్తాయి. ‘సారంగధరీయా’న్ని 1939లో అంకితంగా తీసుకున్న గద్వాల సంస్థానాధీశులు సీతారామ భూపతిరావు కాశీపత్యావధానులకు గండపెండేరం తొడిగారు. గజారోహణం చేయించారు. ‘కవిసింహం’ బిరుదునిచ్చి గద్వాల సంస్థాన ఆస్థాన కవిగా గౌరవించుకున్నారు. పోకూరి నివసించే గుంటూరు జిల్లాలోని మాచర్లకు మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల నుంచి సంస్థాన మర్యాదలతో పల్లకీ వచ్చేది. ‘కవిసింహం’ 1920 ప్రాంతంలో చెన్నపట్టణం (చెనై్న)లో అష్టావధానం చేశారు. అందులో ఒక పృచ్ఛకులైన తాపీ ధర్మారావుగారు కాఫీపై దండకం చెప్పమన్నారు. పోకూరి వారు ఆశువుగా చమత్కారాలతో చెప్పిన దండకం దిగువ పరిశీలించండి.
‘తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరం-2013’ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ నూరురోజుల సాంస్కృతికోత్సవాలను నిర్వహిస్తోంది. రవీంద్రభారతిలో అవధాన సప్తాహంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. వేదికకు ‘కొలచెల్మ మల్లినాథుడు’ పేరు పెట్టారు. ఏమిటి విశేషం? ఈ ప్రశ్నకు సమాధానంగా తెలుగువారి అవధాన పరంపరకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వివరించారు స్వయంగా అవధాని, అవధానంపై పరిశోధన చేసిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి డా రాళ్లబండి కవితాప్రసాద్.
శ్రీమన్మహాదేవి... లోకేశ్వరీ!
కాళికా సన్నిభాకారిణీ
లోక సంచారిణీ
అంబ కాఫీ జగన్మోహినీ
తొల్లి శ్రీకృష్ణుడాస్వర్గమున్ జేరి
పూతంబ పారిజాతంబున్ తెచ్చియున్
నాతికిన్ ప్రీతిగానిచ్చుకాలంబు నందు
ఆ సుమంబునందునం గల్గు బీజంబు
ఉర్వీస్థలిన్ రాలియున్
లోక బేధంబుజే కాఫి భూజంబుగా పుట్టియున్
కొమ్మలన్ రెమ్మలన్ బూవులన్ తావులన్ జక్కనౌపిందెలన్ జిక్కినౌ కాయలన్
చొక్కమౌ బండ్ల భాసిల్ల దద్బీజజాలంబు
ఐర్లండు నింగ్లండు హాలెండు పోలెండు రష్యా జపాన్ జర్మనీ గ్రీకు దేశంబులన్ నాటి పెన్ మాకులై
ఇండియాన్ తోటలై విత్తనాలిచ్చుచున్నావటంచున్ మదించోడిన్ బాపురే తీపిలో నీరమున్ క్షీరమున్ చక్కెరన్ మించుటన్ గాదె
నీ బీజ చూర్ణంబు ఆ మూటిలో జేర్చి సేవించుటన్
నీదు బీజంబునన్ బెంచులో మాడ్చి
చూర్ణంబు గావించినన్ తీపి పోదాయె
నీ మాధురీ శక్తి నీ యింపు నీ సొంపు నీ పెంపు వర్ణింప నేనెంతవాడన్ ధనాకర్షిణీ ప్రాణసంరక్షిణీ ధాత్రినెవ్వారలేన్ వేకువన్ లేచియున్
నిత్యకృత్యంబులన్ దీర్చి మున్ముందుగా నిన్ని పానంబు గావింపకున్నన్
ద్విజుల్ వేదమంత్రంబులున్ పల్కగాలేరు
ప్రాంచత్కవుల్ పద్యంబుల్ హృద్యమౌరీతి నిర్మింపగా లేరు
శిల్పులు శౌరి దాసుల్
గళంబునెత్తియున్ బాడి
నృత్యంబులన్ చేయగా లేరు
శిల్పుల్ మనస్ఫూర్తిగా సుత్తి చేపట్టగా లేరు
వైశ్యోత్తముల్ కొట్ల తాళంబులన్ తీయగాలేరు
డ్రైవర్లు స్టీరింగులన్ పట్టగా లేరు
టీచర్లు పాఠంబులన్ చెప్పగాలేరు
డాక్టర్లునింజక్షనుల్ జేయగాలేరు
ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు
జడ్జీలు ఏ స్వల్పమౌ తీర్పులన్ జెప్పగాలేరు
దిట్టంబుగా బ్రాలసుల్ కూట సాక్ష్యంబులన్ చెప్పగాలేరు
వారంగనల్ కోడెగాండ్రన్ వెసన్ కేళిలో నోలలాడింపగాలేరు
ముప్పూటలన్ నిన్నొగిన్ గ్రోలకున్నన్
శిరోభారమైనాల్క ఎండున్-మనంబెంతో చాంచల్యమున్
నిత్యమున్ వేకువన్ దర్శనంబిచ్చి
నిన్ బాగుగా త్రాగు సౌభాగ్యమున్ గూర్చి రక్షింపవే
సారెకున్ గొల్చెదన్
విశ్వకర్మాస్వయంబంధునన్
సత్కవీంద్రుడనన్ చెల్లు
పోకూరి కాశీపతి స్వాంతరాజీవసంవాసినీ
నీకికన్ మంగళంబౌ మహాకాఫీ దేవీ నమస్తే నమస్తే నమస్తే నమః
- పున్నా కృష్ణమూర్తి