పటేల్... నాలుగో‘సారీ’!
♦ ఆర్బీఐ పాలసీ రేటు యథాతథం..
♦ ద్రవ్యోల్బణం భయాలే కారణం
♦ 6.25 శాతంగానే కొనసాగనున్న రెపో
♦ ఎస్ఎల్ఆర్ మాత్రం 0.5 శాతం తగ్గింపు
♦ బ్యాంకుల వద్ద పెరగనున్న లిక్విడిటీ
♦ వృద్ధి అంచనాలు 7.4% నుంచి 7.3 శాతానికి డౌన్
ముంబై: ద్రవ్యోల్బణం భయాలను కారణంగా చూపుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో మంగళ, బుధవారాల్లో సమావేశమైన ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 2017–18 రెండవ ద్వైమాసిక పరపతి సమీక్ష నిర్ణయాలను బుధవారం ప్రకటించింది. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను మాత్రం 0.5 శాతం తగ్గించింది. ఆర్బీఐ నిర్ణయాలను ఒక్కసారి పరిశీలిస్తే–
⇒ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపోను పాలసీ కమిటీ యథాతథంగా కొనసాగించింది. అంటే గడిచిన 8 నెలలుగా ఈ రేటు 6.5 శాతంగానే ఉంది. మారలేదు.
⇒ బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధుల నిల్వలను ఆర్బీఐ వద్ద ఉంచి, పొందే వడ్డీరేటు– రివర్స్ రెపో యథాపూర్వం 6 శాతంగా కొనసాగనుంది.
⇒ తన డిపాజిట్లలో బ్యాంకులు తప్పనిసరిగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఉంచాల్సిన మొత్తానికి సంబంధించిన స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను (ఎస్ఎల్ఆర్) 0.5 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 20 శాతానికి తగ్గింది. దీనివల్ల బ్యాంకులకు మరిన్ని నగదు నిల్వలు అందుబాటులోకి వస్తాయి. మరిన్ని రుణాలను మంజూరు చేయగలుగుతాయి.
⇒ దీర్ఘకాలంలో వృద్ధికి మద్దతు లభించేలా... ద్రవ్యోల్బణం లక్ష్యాలకు అనుగుణంగా 2% అటు ఇటుగా(మైనస్/ప్లస్) 4 % కొనసాగించడానికి తగిన పాలసీని ప్రకటిస్తున్నటు ఆర్బీఐ పేర్కొంది.
⇒ పాలసీ రేటును యథాతథంగా కొనసాగించడానికి ఐదుగురు సభ్యులు సానుకూలంగా ఉండగా, ఒకరు– రవీంద్ర హెచ్ ధోలాకియా దీనిని వ్యతిరేకించారు.
⇒ ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణ జరగాలనీ, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య పరిష్కారం కావాలని, మౌలిక రంగంలో అడ్డంకులను తొలగించాలని సూచిన ఆర్బీఐ, ఆయా అంశాలు మెరుగుపడినప్పుడు పరపతి విధానం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని సూచించింది.
⇒ వ్యవసాయ రుణ రద్దు వల్ల ద్రవ్య క్రమశిక్షణా సమస్యలు పెరిగే వీలుంది. ప్రత్యేకించి ద్రవ్యోల్బణంపైనా ఈ ప్రభావం ఉంటుంది.
⇒ అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక సమస్యలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచడానికి దారితీసే ఇబ్బంది ఉంది. 7వ వేతన సంఘం సిఫారసులూ ఈ దిశగా సమస్యను పెంచేవే.
⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను 7.4 శాతం నుంచి 7.3 శాతానికి పాలసీ కమిటీ తగ్గించింది.
⇒ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు స్థూలంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదు.
⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (2017–18, ఏప్రిల్–సెప్టెంబర్) రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 3.5% మధ్య నమోదయ్యే వీలుంది. ద్వితీయార్ధంలో(అక్టోబర్– మార్చి) ఇది 4.5 శాతానికి పెరగవచ్చు.
పారిశ్రామిక రంగం నిరుత్సాహం..
ఆర్బీఐ రెపో రేటును తగ్గించకపోవడం పట్ల పారిశ్రామిక వర్గాలు నిరుత్సాహాన్ని వ్యక్తం చేశాయి. ఆర్బీఐ ద్రవ్యోల్బణం పట్ల అతి జాగ్రత్త ప్రదర్శించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ద్రవ్యోల్బణం పూర్తి అదుపులో ఉన్నప్పటికీ, పాలసీ రేట్లు తగ్గించకుండా పారిశ్రామిక రంగాన్ని ఆర్బీఐ నిరుత్సాహానికి గురిచేసిందని ఇండస్ట్రీ చాంబర్ అసోచామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడంతో ఆర్బీఐ నుంచి రేటు కోత ఆశించినట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ గోపాల్ జీవరాజ్ పేర్కొన్నారు. రుణ వ్యయాల తగ్గింపు సమీప భవిష్యత్తులో వృద్ధికి బాటలు వేస్తుందని హౌస్ ఆఫ్ హిరనందిని ఎండీ, చైర్మన్ సురేంద్ర హిరనందిని పేర్కొన్నారు.
రీమోనిటైజేషన్ 83%!
డీమోనిటైజేషన్ అనంతరం, రద్దు చేసిన మొత్తంలో 83% నగదును తిరిగి వ్యవస్థలోకి తెచ్చినట్లు (రీమోనిటైజేషన్) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో తెలియజేశారు. వ్యవస్థలో నగదు కొరత లేదని స్పష్టం చేశారు. ‘‘మా వద్ద ఉన్న తాజా గణాంకాల ప్రకారం, 82.67 శాతం కరెన్సీ తిరిగి వ్యవస్థలోకి వచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు. నగదు లభ్యతపై ఆర్బీఐ రోజువారీ ప్రాతిపదికన సమీక్షిస్తోందని, ఏదైనా కొన్ని ప్రాంతాల్లో నగదు సమస్య ఉన్నా... తక్షణం పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. సమస్య దీర్ఘకాలంగా, యథాతథంగా కొనసాగే రీతిలో ఉంటోందన్న విమర్శతో మాత్రం తాను అంగీకరించనని స్పష్టంచేశారు.
వృద్ధిపై డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ లేదు...
డీమోనిటైజేషన్ తక్కువ స్థాయి వృద్ధికి దారితీయలేదని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. డీమోనిటైజేషన్‌కు ముందే అంటే 2016–17 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే ఆర్థిక క్రియాశీలత మందగించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయన్నారు.
రేట్ల తగ్గింపునకు తగిన సమయమే: కేంద్రం
సరళతర పాలసీ విధానాన్ని అవలంభించడానికి తగిన ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ‘ఆర్బీఐ అభిప్రాయాలను, నిర్ణయాలను మేం గౌరవిస్తున్నాం. ఇటు రిటైల్ ద్రవ్యోల్బణం, అటు టోకు ద్రవ్యోల్బణం రెండు పూర్తి కట్టడిలో ఉన్నాయి. రేటు తగ్గింపునకు అవకాశం కల్పిస్తున్నాయి’ అని ఆయన అన్నారు.
మొండిబకాయిలపై దృష్టి కొనసాగుతుందని ఆర్బీఐ మరోసారి స్పష్టం చేయడం ఆహ్వానించతగినది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఎస్ఎల్ఆర్ తగ్గింపు, గృహ రుణాలకు రిస్క్ వెయిటేజీ తగ్గించడం సానుకూలం. ఇవి బ్యాంకు లిక్విడిటీని పెంచడంతోపాటు గృహరుణాల వృద్ధికి ప్రోత్సాహాన్నిస్తాయి – చందా కొచర్, ఎండీ, సీఈవో, ఐసీఐసీఐ బ్యాంక్
హౌసింగ్ రంగానికి బూస్ట్!
కొత్త గృహ రుణాలకు సంబంధించి భారాన్ని తగ్గించే కీలక విధాన నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుంది. వ్యక్తిగత గృహ రుణాలపై స్టాండర్డ్ అసెట్స్ ప్రొవిజన్స్‌ను (రుణానికి సంబంధించి రిస్కులను తట్టుకోవడానికిగాను పక్కనబెట్టాల్సిన మొత్తం) పావుశాతానికి ఆర్బీఐ తగ్గించింది. ఇంతక్రితం ఈ రేటు 0.4 శాతంగా ఉండేది. ఈ తరహా రుణాలపై రిస్క్ వెయిటేజ్నీ తగ్గించింది. ‘‘వ్యక్తిగత గృహ రుణాలకు సంబంధించి ఎల్టీవీ (లోన్ టూ వ్యాల్యూ) రేషియోలు, రిస్క్ వెయిటేజ్, స్టాడెర్డ్ అసెట్ ప్రొవిజనింగ్ రేట్‌ను సమీక్షిస్తున్నాం’’ అని ఆర్బీఐ పాలసీ ప్రకటన తెలిపింది.
ప్రయోజనాలు ఇవీ...
⇒ స్టాండెర్డ్ అసెట్ ప్రొవిజన్స్ తగ్గింపు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపునకు వీలు కలుగుతుంది.
⇒ కొన్ని క్యాటగిరీలకు చెందిన రుణాలపై రిస్క్ వెయిటేజ్నీ ఈ నిర్ణయం తగ్గిస్తుంది. క్యాపిటల్ అడిక్వెషీ (మూలధన లభ్యత) కోణంలో బ్యాంకులకు ప్రయోజనం కల్పించే అంశం ఇది. మరిన్ని రుణాలను మంజూరు చేయడానికి ఇది వీలు కలిగిస్తుంది.
⇒ రూ.75 లక్షల పైన వ్యక్తిగత గృహ రుణాలకు సంబంధించి రిస్క్ వెయిటేజ్ ప్రస్తుత 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుంది. రూ.30 నుంచి రూ.75 లక్షల మధ్య రుణాలపై రిస్క్ వెయిటేజ్ 35 శాతం వరకూ తగ్గుతుంది.
⇒ మందగమన వృద్ధి అంకెలకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా ఆర్బీఐ తీసుకుంటున్న చర్య ఇదని గవర్నర్ ఉర్జిత్ పటేల్ వివరించారు.
పటిష్ఠంగానే! స్వయంప్రతిపత్తి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వయం ప్రతిపత్తి పటిష్టంగా ఉందనడానికి సంబంధించిన తాజా పరిణామం ఒకదానిని గవర్నర్ ఉర్జిత్ పటేల్ వివరించారు. దీనిప్రకారం– పాలసీ సమావేశానికి ముందు గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ)తో సమావేశం కావాలని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను విధాన కమిటీ ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. విలేకరుల సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా గవర్నర్ ఈ విషయాన్ని చెప్పారు. రేటు తగ్గించాలని ఆర్థికశాఖ కోరుకుంటున్నట్లు పలు వార్తలు వెలువడ్డాయి.
సంబంధిత శాఖ అధికారులు–పరపతి విధాన సభ్యుల మధ్య జూన్ 1న ఒక సమావేశం జరగనుందని వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా పటేల్ ఈ విషయాన్ని తెలిపారు. వృద్ధే లక్ష్యంగా పలు సందర్భాల్లో ప్రభుత్వం రేటు తగ్గింపు కోరుకుంటుంటే, ద్రవ్యోల్బణంపైనే దృష్టి సారిస్తూ... ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య కొంత ఘర్షణాత్మక వైఖరి నెలకొంటోంది. కేంద్రం డీమోనిటైజేషన్ నిర్ణయం అనంతరం కూడా ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.