న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19)లో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశాలు ఉన్నప్పటికీ.. రేట్ల పెంపునకు క్రమంగా ద్వారాలు తెరచుకుంటున్నాయని నిపుణులు భావిస్తున్నారు. తాజాగా ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశ వివరాల్లో రేట్ల పెంపు సంకేతాలు వెలువడ్డాయని బ్రోకరేజి సంస్థలు కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, మోర్గాన్ స్టాన్లీ పేర్కొన్నాయి. తాజా పాలసీలో కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే.
ప్రధానంగా ధరల పెరుగుదల రిస్కులను ఇందుకు కారణంగా చూపింది. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రేట్లలో ఎలాంటి మార్పులు అక్కర్లేదని సూచించగా.. ఒకరు మాత్రం పావు శాతం రెపో రేట్ల పెంపునకు మొగ్గుచూపారు. ‘ఈ ఏడాది ఆర్‌బీఐ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చు. అయితే, పెంపు అంచనాలు మరింతగా పెరిగాయి. ఎంపీసీ భేటీలో ఎక్కువ మంది సరళ విధానానికి ఇక తెరదించాలని భావిస్తుండటమే దీనికి కారణం’ అని కోటక్ ఎకనమిక్ రీసెర్చ్ ఒక నోట్‌లో పేర్కొంది.
కాగా, వచ్చే సమీక్ష(జూన్ 4–5)లో ప్రస్తుత యథాతథ పరిస్థితికి తెరదించాలని(రేట్ల పెంపు సంకేతాలు) ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య సూచించడం గమనార్హం. అయితే, ఇప్పుడప్పుడే ఆర్‌బీఐ రేట్లను పెంచకపోవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంటోంది. ఆర్‌బీఐ ఎంపీసీ తాజా భేటీలో కాస్త కఠిన వైఖరి సంకేతాలు వెలువడినప్పటికీ.. ఆగస్టులో జరిగే పాలసీ సమీక్షలో పావు శాతం రేట్ల కోతకు ఆస్కారం ఉందని అంచనా వేసింది. ‘ప్రధానంగా సాధారణ వర్షపాతం గనుక నమోదైతే ద్రవ్యోల్బణం ఇక తగ్గుముఖం పట్టేందుకు అవకాశాలున్నాయి. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.3 శాతంగా నమోదుకావచ్చు. ఈ పరిణామాలతో ఆగస్టులో ఒక విడత రేట్ల కోత ఉండొచ్చని భావిస్తున్నాం’ అని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment