వడ్డీ రేట్లు 1% తగ్గాల్సిందే..
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా
- రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని
- జీఎస్‌టీ అమలుపై వ్యాఖ్య
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ రేటును ఒకశాతం వరకూ తగ్గించడానికి తగిన సమయం ఇదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. ఒక వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రెపో రేటు (బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే స్వల్పకాలిక రుణంపై వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.25%) అర శాతం నుంచి ఒక శాతం వరకూ తగ్గించే అవకాశం ఆర్‌బీఐకి వుందని అన్నారు.
అమెరికా ఫెడ్ వడ్డీరేట్లపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా... భారత్‌లో రెపో రేటును అరశాతం వరకూ తగ్గించే వీలుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వృద్ధి రేటు 8% దాటే అవకాశం ఉందని అన్నారు. పెట్టుబడుల సెంటిమెంట్ పునరుద్ధరణ దీనికి కారణమని ఆయన విశ్లేషిస్తూ... రానున్న మూడు త్రైమాసికాల గణాంకాల్లో మంచి ఫలితాలు వెలువడటం ఖాయమన్నారు. క్యూ1లో 7 శాతం వృద్ధి రేటును ప్రస్తావిస్తూ... దీనిని ఎగువముఖంగా సవరించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
జీఎస్‌టీపై కామెంట్ ఇదీ...: రాజకీయ వాతావరణంలో ఇది ఇలా జరిగిపోతుందని చెప్పడం సాధ్యం కాదు. పరిస్థితులు మారుతుంటాయి. మొత్తంగా చూస్తే... వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు ప్రక్రియ జరుగుతుంది. నిజానికి ఈ ప్రక్రియ 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచీ ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు జరపాలన్నది ప్రభుత్వ సంకల్పం. కానిపక్షంలో మరో ఆరు నెలలు పట్టచ్చు. అమలు ఖాయం. కాంగ్రెస్ అడ్డుపడితే ఏప్రిల్ నుంచి జీఎస్‌టీ అమలు మరింత ఆలస్యం కావచ్చని బుధవారంనాడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఈ పరోక్ష పన్ను వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినా... బీజేపీకి మెజారిటీ లేని రాజ్యసభలో ఆమోదం లభించలేదు. భారత్‌లో పెట్టుబడుల పట్ల అంతర్జాతీయ పెట్టుబడులు సానుకూల రీతిలో స్పందిస్తున్నట్లు పనగారియా పేర్కొన్నారు.