కండక్టర్ తనయుడు ఆర్టీసీ ఎండీ
బాధ్యతలు స్వీకరించిన పూర్ణచంద్రరావు
ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన ఎ.కె. ఖాన్
సాక్షి, హైదరాబాద్: ‘మా నాన్న రాధాకృష్ణమూర్తి కండక్టర్గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి ఆర్టీసీతో అనుబంధం ఉంది. సంస్థకు రుణపడి ఉన్నా. ఇంత కాలానికి నాకు సంస్థ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది’ అని ఆర్టీసీ నూతన ఎండీ జె.పూర్ణచంద్రరావు అన్నారు. శనివారం ఎ.కె.ఖాన్ నుంచి బాధ్యతలు స్వీకరించాక పూర్ణచంద్రరావు విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు సంస్థ బాగోగులపై దృష్టి పెడతానని చెప్పారు. ప్రజలకు ఆర్టీసీ మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేస్తానన్నారు.
ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. పోలీసు ఉద్యోగమే అత్యంత క్లిష్టమైందని, ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించడం అంతకంటే క్లిష్టం కాదని తాను భావిస్తున్నానని చెప్పారు. ఆర్టీసీ ఎండీగా ఏడాదిన్నర కాలం పనిచేయడం సంతోషంగా ఉందని ఎ.కె.ఖాన్ అన్నారు. ఆర్టీసీ ఎండీగా పూర్ణచంద్రరావుకు బాధ్యతలు అప్పగించిన తర్వాత అనినీతి నిరోధక విభాగం(ఏసీబీ) డీజీగా ఎ.కె. ఖాన్ బాధ్యతలు చేపట్టారు.