రెండో రోజూ అన్నదాతపై దండయాత్ర
సుమారు 450 ఎకరాల్లో
గసగసాల పంట ధ్వంసం ముగ్గురి అరెస్ట్
చౌడేపల్లె : చౌడేపల్లె మండలంలోని బోయకొండ సమీపంలో గల వివిధ గ్రామాల్లో గసగసాల పంటపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు పోలీసులు రెండో రోజైన బుధవారమూ దాడులు కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం దాక దాడు లు చేసి, పంటను ట్రాక్టర్ల సాయంతో ధ్వంసం చేశారు. ఎక్సెజ్ డెప్యూటీ కమిషనర్ డీవీ.ప్రసాద్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు, ఎన్ఫోర్సుమెంటు స్క్వాడ్ ఉదయమే గ్రామాలకు చేరుకున్నారు. 13 టీములుగా ఏర్పడి బోయకొండ, భవానినగర్, మేకలవారిపల్లె, అట్లవారిపల్లె, దిగువపల్లె, కాగతి, పెద్దూరు, గజ్జలవారిపల్లె, ఎగువ గాజులవారిపల్లె, దిగువ గాజులవారిపల్లె, చిప్పిలేపల్లె, దాసరయ్యగారిపల్లె, మల్లువారిపల్లె, ఊటూరు, కొలింపల్లె, రాచవారిపల్లె, కోటూరు, పెద్దకొండామర్రి, చారాల, కాగతియల్లంపల్లె, వెంగలపల్లె, మోట్లపల్లె, కాటిపేరి, కరణంవారిపల్లె, మాదంవారిపల్లె తదితర గ్రామాల్లో రైతులు సాగు చేసిన గసగసాల పంటను 450 ఎకరాల్లో ధ్వంసం చేశారు. ట్రాక్టర్ల సాయంతో దున్నేశారు. దళారుల మాటలు న మ్మి నిలువునా మోసపోయామని రైతులు బోరున విలపించారు.
ఎన్డీపీఎస్ యాక్టు ప్రకారం ముగ్గురి అరెస్ట్
నార్కొటిక్ డ్రగ్స్ బ్యూరో ఆఫ్ ఇండియా యాక్టు ప్రకారం గసగసాలు పంట సాగుచేయడం నేరమని ఎక్సెజ్ సీఐ జానకిరామ్ బుధవారం తెలిపారు. రైతులకు గసగసాల పంట సాగుకు అవసరమైన విత్తనాలు, మార్కెటింగ్‌కు సహకరిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో పెద్దూరుకు చెందిన సుబ్రమణ్యంశెట్టి, గజ్జలవారిపల్లె ఏ.వెంకటరెడ్డి, చౌడేపల్లెకు చెందిన ఈ.రెడ్డెప్పశెట్టిని పోలీసులు అరెస్ట్ చేశార. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నారు.
రెవెన్యూ అధికారుల సాయంతో వివరాల సేకరణ
రెవెన్యూ అధికారుల సహాయంతో గసగసాలు పంట సాగుచేస్తున్న రైతుల వివరాలు సేకరిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. రైతులు కూడా స్వచ్ఛందంగా సాగులో ఉన్న పంటను ధ్వంసం చేయాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో ఏఈఎస్ మధుసూదన, మల్లారెడ్డి, సీఐ చౌదరి, ఎస్ఐలు మనోహర్‌రాజు, ఇస్మాయిల్, దస్తిగిరి పాల్గొన్నారు.
సదుం మండలంలో..
మండలంలోని రెడ్డివారిపల్లెలో ఇద్దరు రైతులు సాగు చేస్తున్న గసగసాల తోటలను రెవెన్యూ అధికారులు బుధవారం ధ్వంసం చేశారు. 60 సెంట్లలో పంటను ధ్వంసం చేసినట్లు తహశీల్దారు రేణుక తెలిపారు. వేలాది రూపాయలు వెచ్చించి పంట సాగు చేశామని, 20 రోజుల్లో పంట చేతికొచ్చేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.