అభ్యంతరకర ఫొటోలు, నటి అరెస్ట్
ముంబై: తాచు పాముతో ఫొటో దిగి అరెస్టైన టీవీ నటి శ్రుతి ఉల్ఫాత్ కు బెయిల్ లభించింది. బొరివలీ కోర్టు ఆమెకు రూ. 5వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. శ్రుతితో పాటు నటుడు పెర్ల్ పూరి, ఇద్దరు నిర్మాతలు ఉత్కర్ష్బాలి, నితిన్ సోలంకిలను బుధవారం ముంబై అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు.
అంతరించిపోయే జాబితాలో ఉన్న తాచుపామును టీవీ సీరియల్ ప్రచారానికి వాడుకున్నారనే ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేశారు. తాచుపాము పట్టుకుని దిగిన ఫొటోలు, వీడియోలు గత అక్టోబర్ లో శ్రుతి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. జంతు ప్రేమికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఫొటోలో చూపిన పాము నిజమైనది కాదని, గ్రాఫిక్ ఇమేజ్ అని సీరియల్ యూనిట్ వాదించింది. ఈ ఫొటోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి నిర్థారణ చేసుకున్న తర్వాత ఫారెస్ట్ రేంజ్ అధికారులు వీరిని అరెస్ట్ చేశారు.